నువ్వేమైనా తోపీ..సిరిసిల్ల  కలెక్టర్ హల్‌చల్ - MicTv.in - Telugu News
mictv telugu

నువ్వేమైనా తోపీ..సిరిసిల్ల  కలెక్టర్ హల్‌చల్

March 23, 2020

ktdjggb

‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. నాకేం అవుతుంది? కరోనానా అది వచ్చినప్పుడు చూసుకుందాంలే’ అనే నిర్లక్ష్య ధోరణి కొందరిలో స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. దండం పెట్టి చెబుతున్నా వారు వినకుండా బయటకు వస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని ప్రాంతాల్లో కరోనాను లెక్కచేయకుండా కొందరు లైట్‌గా తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆంక్షలను, పోలీసులు మైకులు పట్టుకుని అరుస్తున్నా పట్టించుకోకుండా వారికి చీమ కుట్టినట్టు కూడా ఉండటంలేదు. రోజూ లాగే.. బైక్‌లు, కార్లు వేసుకుని రోడ్ల మీదకు వచ్చేస్తన్నారు. అదేంటని అడిగితే ఏవేవో కారణాలు చెబుతున్నారు. కొందరు ఈ సిటీ దాటితే ఊరు వెళ్లిపోవచ్చనే భ్రమలో బయటకు వచ్చి చిక్కుల్లో పడుతున్నారు. రవాణా వ్యవస్థను పూర్తిగా రాష్ట్ర సరిహద్దుల్లో మూసివేసిన విషయం తెలిసిందే. అయినా కొందరు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 

దీంతో రోడ్డుపైకి వచ్చిన వారిపై రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలపై వెళ్లే వారిని ఆపి.. ‘ఏంటి బయటకు ఎందుకు వచ్చారు? నువ్వు ఏమైనా తోపువా? నీకు ఏమైనా కొత్త రూల్స్ ఉన్నాయా?’ అంటూ వాహనదారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్లు, బైక్‌లను ఆపి క్లాస్ తీసుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ ఫ్యామిలీని సైతం ఆపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కలెక్టర్ కోపం సరియైందే అంటున్నారు. మనకోసమే ఆయన కోప్పడుతున్నారని అంటున్నారు. కాగా, కరోనాను కట్టడి చేయాలంటే అందరూ సహకరించాల్సిందే. లేదంటే ఇటలీ మాదిరి అయిపోతుంది మన రాష్ట్రం అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకని ప్రభుత్వం ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలకు పాల్పడటం మన మంచికే అని అందరూ గ్రహించాలి అని కొందరు నెటిజన్లు అలాంటివారికి గడ్డి పెడుతున్నారు.