రాజన్న సిరిసిల్లా జిల్లాలో సంచలనం సృష్టించిన మూడపల్లి యువతి శాలిని కిడ్నాప్ కేసులో తాజాగా ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగానే తన ప్రియుడు జాన్‌తో వెళ్లినట్లు ఓ వీడియో ద్వారా తల్లిదండ్రులతో పాటు తన కోసం వెతుకుతున్న పోలీసులందరికీ షాక్ ఇచ్చింది. తానూ, జానీ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తమకు ఇది వరకే పెళ్లి అయినట్లు ఆమె చెప్పింది. అయితే తాను మైనర్ కావడం వల్ల , తల్లిదండ్రులు బెదిరించడంతో.. ఈ పెళ్లి గురించి తన తల్లిదండ్రులు అనవరంగా జానీపై కేసు పెట్టారని తెలిపింది. కేసులో జానీ పది నెలల జైలు శిక్షను అనుభవించాడని, జైలు నుంచి విడుదలైన తర్వాత.. తన మైనార్టీ కూడా తీరిపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. అయితే తన పేరెంట్స్ మరో యువకుడితో నిన్న (సోమవారం) నిశ్చితార్థం జరిపించడంతో.. సడెన్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఓ వీడియో సందేశం ద్వారా తెలిపింది. పెళ్లి ఫోటోలు కూడా బయటపెట్టింది.
పెళ్లి బట్టలతో వీడియోలో మాట్లాడుతూ.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వెళ్లిపోదామని డిసైడ్ అయ్యానని చెప్పింది. అయితే కిడ్నాప్ గురైన సమయంలో మాస్క్ పెట్టుకున్న కొందరు వ్యక్తులు కారు ఎక్కించడంతో.. ఆ వ్యక్తి జానీ కాదనుకొని కేకలు వేశానని చెబుతోంది. తెల్లవారుజామున ఆలయంలో పూజ ముగించుకొని వస్తున్న సమయంలో జానీ తీసుకెళ్లాడని ఆమె చెబుతున్న మాటలపై అందరూ షాకవుతున్నారు.