దుబాయ్ వేదికగా గతకొన్ని రోజులుగా జరుగుతున్న ఆసియా కప్ 2022 మ్యాచ్‌లు గతరాత్రితో ముగిశాయి. తొలిదశ నుంచి ముగింపు దశ వరకు ఆయా జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు సాగింది. కప్‌ను సొంతం చేసుకోవటం కోసం ఆటగాళ్లు నువ్వా, నేనా అన్నట్లుగా చేలరేగి ఆడారు. అభిమానులు అంచనాలను తారుమారు చేస్తూ, ఆసియా కప్ మ్యాచ్ ఫైనల్‌కి పాకిస్తాన్, శ్రీలంక జట్లు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టుపై శ్రీలంక జట్టు ఘన విజయం సాధించి, కప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో శ్రీలంక లంక ఖాతాలో ఇది 6వ ఆసియా కప్ టైటిల్. గతంలో శ్రీలంక 1986, 1997, 2004, 2008, 2014లోనూ టైటిల్ సాధించింది.
వివరాల్లోకి వెళ్తే..మొదటగా టాస్ ఓడిన శ్రీలంక జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. అందులో భానుక రాజపక్స 45 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కుషాల్ మెండిస్ (0), ధనుష్క గుణతిలక (1), దసున్ షనక (2), నిసాంక (8), ధనంజయ డిసిల్వ (28) విఫలమవడంతో శ్రీలంక 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో రాజపక్స తన కెరీర్లోనే అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. అతనికి తోడుగా వణిండు హసరంగ (36; 5 ఫోర్లు, ఒక సిక్సర్), చమిక కరుణరత్నె (14 నాటౌట్) చక్కటి సహకారం అందించారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్..20 ఓవర్లలో147 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (55) అర్ధశతకంతో ఆకట్టుకోగా, ఇఫ్తిఖార్ (32), రవుఫ్ (13) మినహా తక్కినవాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలో ప్రమోద్ 4, హసరంగ మూడు వికెట్లు పడగొట్టారు.
ఈ క్రమంలో శ్రీలంక ఆటగాడు రాజపక్స 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అందరిచేత అదరహో అనిపించాడు. ఈ విజయంతో శ్రీలంక దేశపు ప్రజలు, క్రికెట్ బోర్డు యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంక దేశానికి ఈ గెలుపు ఊరటనిచ్చే అంశామని పేర్కొన్నారు.