హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన నరబలి కేసు మిస్టరీ వీడింది. తానే పాపమూ ఎరగగని బొంకిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తన భార్య ఆరోగ్యం కోసం ఒక గిరిజన శిశువును గొంతుకోసి బలి ఇచ్చానని పోలీసుల విచారణలో వెల్లడించారు. దీంతో నేరాన్ని వేరేవారిపై నెట్టేయాలనుకున్న అతని కుతంత్రాలకు చెక్ పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ చిలకనగర్లో నివసిస్తున్న రాజశేఖర్ భార్యకు ఆరోగ్యం బాగుండడం లేదు. దీంతో చాలా గుళ్లకు తిరిగారు. ఓ మంత్రగాడిని కూడా సంప్రదించారు. చంద్రగ్రహణం రోజున నరబలి ఇస్తే ఆమె రోగం పోతుందని మంత్రగాడు చెప్పాడు. దీంతో రాజశేఖర్ చంద్రగ్రహణం రోజున ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహించాడు. కరీంనగర్ జిల్లాలోని ఓ గిరిజన తండాను నుంచి కొనుక్కొచ్చిన నాలుగు నెలల ఆడశిశువును గొంతుకోసి చంపాడు.
తలను గ్రహణం సందర్భంగా డాబాపై ఉంచాడు. మొండేన్ని మాయం చేశాడు. ఉదయం డాబామీదికెళ్లిన రాజశేఖర్ అత్తకు శిశివు తల కనిపించింది. నేరం తనది కాదని చెప్పడానికి రాజశేఖర్ పోలీసులకు ఫోన్ చేసిన తమ ఇంటిపై ఎవరో తల విసిరారని బొంకాండు. పోలీసు జాగిలం కూడా రాజశేఖర్ ఇంటి ఎదురుగా ఉన్న నరహరి ఇంట్లో వెళ్లడంతో నరహరిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నరహరి కుమారుడు కూడా అనారోగ్యంతో బాధపడుతుండడంతో అతడే నరబలి చేశారని వార్తలు వచ్చాయి .
అయితే రాజశేఖర్ వ్యవహారంపై పోలీసులుకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు. మంత్రగాడితోపాటు మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దారుణానికి గురైన బాలిక తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు యత్నిస్తున్నారు.