కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి రూ.2000 కోట్లు! - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి రూ.2000 కోట్లు!

July 11, 2020

Rajasthan CM Ashok Gehlot accuses BJP of trying to topple his govt; BJP blames 'infighting' within Congress

అధికారంలో ఉన్న మా ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. బీజేపీవి సిగ్గులేని ప్రయత్నాలు అని మండిపడ్డారు. అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి చర్చించేందుకు ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్నాం. కానీ, బీజేపీకి అవేవీ పట్టడంలేదు. మానవత్వం మరిచిపోయి మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పన్నుతోంది.  సిగ్గుకి కూడా ఓ పరిమితి ఉంటుంది. కొంతమంది సిగ్గులేనివాళ్లు ఆ పరిమితులు అస్సలు పట్టించుకోకుండా నిస్సుగ్గుగా వ్యవహరిస్తారు. గుజరాత్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లి రెండు సీట్లు సాధించారు. ఇక్కడ కూడా ఆ పాచిక వేద్దామనుకున్నారు. కానీ, వారి పప్పులు ఉడకలేవు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేల సహకారంతో మేం రెండు సీట్లు సాధించాం. ఆ సిగ్గులేని వాళ్లు ఇంకా పాత టెక్నిక్‌లతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు’ అని  గెహ్లాట్ బీజేపీపై నిప్పులు చెరిగారు.

కాగా, రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో తాజాగా ఇద్దరు బీజేపీ నేతలను ఎస్ఓజీ అధికారులు అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వారి సంభాషణల్లో ఉందని అన్నారు. ‘రాజస్థాన్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వస్తుంది. కొత్త ముఖ్యమంత్రిని పార్టీ హైకమాండ్ ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్ పైలెట్‌కు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 5 – 10 రోజుల్లో ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది’ అని ఫోన్ సంభాషణల్లో రికార్డ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ ఎన్నికలకు ముందే ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేశారంటూ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.