నిండుసభలో నవ్వులపాలైన సీఎం.. బడ్జెట్ బాగోతం
ఆయన అత్యున్నతమైన సీఎం పోస్టులో ఉన్నారు. ఆర్థిక మంత్రి కూడా ఆయనే. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెడుతూ నిండు సభలో నవ్వుల పాలయ్యారు. బడ్జెట్ అంటే.. కొత్త సీసాలో పాత సారా అన్నా నానుడిని నిజం చేసి నాలుక కర్చుకున్నారు. తాజా బడ్జెట్‌కు బదులు గత ఏడాది బడ్జెట్ పాఠాన్ని మక్కికి మక్కి చదివి తిట్లు తింటున్నారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ బాగోతమిది.
అసెంబ్లీలో ఆయన శుక్రవారం బడ్జెట్ ప్రసంగం చేస్తూ గత ఏడాది బడ్జెట్ ప్రసంగంలోని కొన్ని భాగాలను కాపీ కొట్టి చదివారు. విషయం గ్రహించిన విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు గోలగోల చేశారు. అయినా సీఎం పట్టించుకోలేదు. ఎనిమిది నిమిషాలు పాత బడ్జెట్ నే చదివారు. చివరికి చీఫ్ విప్ జోక్యం చేసుకోవడం పాత రొదను ఆపారు. రణగొణతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు.
తప్పు తెలుసుకున్న సీఎం సభకు క్షమాపణలు చెప్పారు. తొలి పేజీ మాత్రమే పాతదని చెప్పుకొచ్చారు. సీఎం ప్రసంగాన్ని బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెట్టి దుమ్మెత్తిపోస్తున్నాయి. బడ్జెట్ పత్రాలు రూపొందించేందుకు సీఎంకు, అధికారులకు సమయం లేదా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.