కాంగ్రెస్ కన్నెర్ర.. సచిన్ పైలట్‌పై వేటు - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ కన్నెర్ర.. సచిన్ పైలట్‌పై వేటు

July 14, 2020

shn

కాంగ్రెస్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అసమ్మతి వర్గంపై కొరడా ఝళిపించింది. రాజస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి యత్నిస్తున్న సచిన్ పైలెట్‌పై వేటు వేసింది. కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) భేటీకి సచిన్, ఆయన ముఠాలోని కొందరు ఎమ్మెల్యేలు రెండోసారి కూడా గైర్హాజరు కావడాన్నిఅధిష్టానం జీర్ణించుకోవడం లేదు. 

సచిన్‌ను ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్‌ పదవుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పార్టీ సీనియర్‌ నేత రణదీప్‌ సింగ్‌ సుర్జేవాల మీడియాకు వెల్లడించారు. సీఎల్పీ భేటీలో 102 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తమకు సరిపడినంత బలం ఉందని సీఎం అశోక్ గెహ్లాత్ స్పష్టం చేశారు. కాగా, ఇవన్నీ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలని, వాటితో తమకు ఏమాత్రం సంబంధంలేదని బీజేపీ చెప్పింది. అశోక్‌ను తాము బలపరీక్ష కోరలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీష్ పునియా చెప్పారు. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకు 30 కోట్ల రూపాయల ఆశ చూపిందని అశోక్ చెబుతున్నారు. సచిన్ ముఠాలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 200 సీట్లున్న ఉన్న అసెంబ్లీలో బీజేపీకి 72 మంది సభ్యులు ఉన్నారు. సచిన్‌కు మద్దతిచ్చి ఆయనను ముఖ్యమంత్రి చేసే ఉద్దేశం తమలకు లేదని కాషాయ నేతలు అంటున్నారు.