రాజస్థాన్ డీజీపీ ఉమేశ్ మిశ్రా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నమోదయ్యే రేప్ కేసుల్లో 41 శాతం కేసులు ఫేక్ అని వెల్లడించారు. క్రైమ్ డిపార్ట్ మెంట్ వార్షిక సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశంలో రాజస్థాన్ అత్యాచార కేసుల్లో అగ్ర స్థానంలో ఉండడంపై ప్రశ్న ఎదురవగా, మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, రాజస్థాన్ రెండో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. 2019లో ప్రవేశపెట్టిన నూతన విధానం వల్ల భారీ సంఖ్యలో అత్యాచార కేసులు నమోదవుతున్నాయని, ఇవి జాతీయ సగటు 8 శాతం కంటే 5 రెట్లు ఎక్కువని పేర్కొన్నారు.
నేరారోపణ శాతం జాతీయ స్థాయిలో 28.6 ఉండగా, రాష్ట్రంలో 47.9 శాతం ఉందని తెలిపారు. ఇందులో 41 శాతం ఫేక్ కేసులంటూ కొట్టిపాడేశారు. ఇక కోర్టుల ద్వారా నమోదైన రేప్ కేసులు 2018లో 30.5 శాతం ఉండగా, 2022లో అది 14.4 శాతానికి తగ్గిందని వివరించారు. గతేడాది ఐదు కేసుల్లో నిందితులకు మరణ శిక్ష, 209 కేసుల్లో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడిందన్నారు. కేసుల పెరుగుదలపై విమర్శలు వస్తున్నప్పటికీ కేసుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎప్పుడూ నిలిపివేయలేదని, 18 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులపై చర్యలు తీసుకున్నామన్నారు.