పిల్లల్ని కనేందుకు ఖైదీకి పెరోల్ .. హైకోర్టు సంచలన తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లల్ని కనేందుకు ఖైదీకి పెరోల్ .. హైకోర్టు సంచలన తీర్పు

April 11, 2022

nbb

జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ విషయంలో రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. పిల్లల్ని కనేందుకు దాంపత్య జీవితం కోసం ఖైదీకి పదిహేను రోజుల పాటు పెరోల్ ఇచ్చింది. దేశ న్యాయవ్యవస్థలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈ తీర్పు సంఘటన ఈ నెల 8వ తేదీన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన నందలాల్ అనే వ్యక్తి ఓ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పిల్లల్ని కనేందుకు తనకు 15 రోజుల పాటు పెరోల్ ఇవ్వాలంటూ జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకున్నాడు. దీన్ని ఆ కమిటీ తిరస్కరించింది. దీంతో నందలాల్ భార్య హైకోర్టుకు అప్పీలు చేసింది. అక్కడా ఇదే కారణం పిటిషన్‌లో పేర్కొంది. తనకు వివాహం అయినా పిల్లలు లేరనీ, దాంపత్య అవసరాల రీత్యా తన భర్తకు బెయిల్ ఇవ్వాలంటూ అభ్యర్థించింది. దీనిపై విచారించిన కోర్టు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సంతానం కోసం దాంపత్య జీవితం కలిగి ఉండడం అనేది ఖైదీని సాధారణ స్థితికి తీసుకురావడానికి, అతని ప్రవర్తనలో మార్పు తేవడానికి సహాయపడుతుందని వ్యాఖ్యానించింది. పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించడం అంటే ఆమె హక్కులను తిరస్కరించినట్టేనని  అభిప్రాయపడింది.