Rajasthan Man Kills Wife To Get ₹ 1.90 Crore Insurance Amount
mictv telugu

బీమా డబ్బులు కోసం భార్యనే హత్య ..ప్లాన్ బెడిసికొట్టడంతో..

December 1, 2022

బీమా డబ్బులు కోసం ఓ వ్యక్తి పెద్ద ప్లాన్ వేశాడు. భార్య పేరుమీదున్న రూ. 1.90 కోట్లను కాజేయాలనే ఆలోచనతో ఆమెను హత్య చేశాడు. ఓ రౌడీషీటర్‌కు సుపారీ ఇచ్చి ఆమెను అంతమొందించాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి డబ్బులు పొందాలని పథకం రచించాడు. విషయం బయటకు రావడంతో చివరికి జైలు పాలయ్యాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

మహేష్ చంద్, షాలు దంపతులకు 2015లో వివాహమయ్యింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. పెళ్లైన రెండు సంవత్సరాల తర్వాత వీరి మధ్య విబేధాలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది ఉంటోంది. అతడిపై 2019లో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది. ఇటీవల భార్య పేరిట మహేష్ చంద్ ఇన్సూరెన్స్ చేయించాడు. తర్వాత ఆమెను హత్య చేసి వచ్చిన బీమా డబ్బులను పొందాలని పన్నాగం పన్నాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని భావించాడు. దీనికోసం ఓ రౌడీషీటర్‌తో ఒప్పందం కుదర్చుకున్నాడు.

ఇక భార్యను బయటకు రప్పించేందుకు ప్లాన్ వేశాడు. తానో కోరిక కోరుకున్నానని, అది నెరవేరాలంటే 11 రోజులపాటు ప్రతి రోజూ బైక్‌పై హనుమంతుడి గుడికి వెళ్లాలని భార్యకు చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కూడా హెచ్చరించాడు. తన కోరిక నెరవేరిన వెంటనే ఇంటికి తీసుకొస్తానని భార్యకు చెప్పాడు. భర్త మాటలు నమ్మిన ఆమె ప్రతి రోజూ బైక్‌పై ఆంజనేయుడి గుడికి వెళ్లి రావడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె అక్టోబరు 5న తన కజిన్ రాజుతో కలిసి బైక్‌పై ఆలయానికి వెళ్తుండగా కారుతో బలంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో షాలు అక్కడికక్కడే చనిపోగా..ఆమె బంధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే రోడ్డుప్రమాదంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో విషయం బయటకొచ్చింది. ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భర్తే ఈ కుట్రకు ప్లాన్ చేసినట్టు తేలింది. భార్యది సహజ మరణం అయితే కోటి రూపాయలు మాత్రమే వస్తాయని, అదే ప్రమాదంలో మరణిస్తే రూ. 1.90 కోట్లు వస్తాయన్న దుర్బుద్ధితోనే భర్త ఈ కిరాతకానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.