కట్నం ఇవ్వడం తీసుకోవడం నేరం. కానీ ఇప్పటికీ చాలా మంది కట్నాలను ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. గ్రామాల్లో అయితే ఇదో సంప్రదాయం, కట్నం ఇవ్వకపోతే తమ ప్రెస్టీజ్ పోతుందని భావన . ఈ క్రమంలో కొంత మంది తాహతుకు మించి కట్నాలు ఇచ్చి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరికొంత మంది ఉన్నదాంతా ఊడ్చి మరీ ఇచ్చి తమవారి సంతోషమే ముఖ్యమని అనుకుంటున్నారు.
కూతుర్ల పెళ్లిళ్లకు తండ్రులు కట్నాలు ఇవ్వడం కామన్. కానీ ఇక్కడ మేనకోడలి పెళ్లికి కనీవినీ ఎరుగుని రీతిలో ఏకంగా రూ. 3 కోట్ల రూపాయల కట్నాన్ని, లక్షలు విలువ చేసే ఆస్తులను ఇచ్చి తమ గొప్పతనాన్ని చాటుకున్నారు రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు మేమమామలు. తమ మేనకోడలి పెళ్లికి భారీ విరాళం ఇచ్చి ఇప్పుడు వీరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అయితే ఆస్తులు ఉండి కట్నకానుకలు ఇవ్వలేదట..ఇది అనాదిగా వస్తున్న వారి ఆచారమట.
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా బుర్డీ గ్రామానికి చెందిన భన్వర్లాల్ గర్వాకు నలుగురు పిల్లలు. వీరిలో ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఆర్ధికంగా బాగా స్థిరపడ్డారు. చెల్లెలికి పెళ్లి అయ్యింది. ఆమెకు ఒక కూతురు ఉంది. తమ మేనకోడలికి ఈ మధ్యనే పెళ్లిని నిశ్చయించారు. దీంతో 2166 ఎకరాల భూమి కలిగిన ఈ ముగ్గురు మేనమామలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా అంగరంగవైభంగా భారీ కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేశారు.
రూ.3.21 కోట్లు నగదు. 10 ఎకరాల వ్యవసాయ భూమి. రూ.30 లక్షలు విలువ చేసే ప్లాటు. 41 తులాల బంగారం, 3 కేజీల వెండి ఇచ్చారి. అంతేకాదు ఓ ట్రాక్టరు, మేనకోడలు నడిపేందుకు ఓ స్కూటీని కట్నంగా ఇచ్చారు. అంతే కాదండోయ్ పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరి ఒక వెండి నాణేన్ని రిటర్న్ గిఫ్టుగా ఇచ్చారు.
బుర్డీ గ్రామంలో జరిగే ప్రతి పెళ్లిలో మైరా సంప్రదాయాన్ని అనుసరిస్తారు గ్రామస్తులు. ఈ సంప్రదాయం ప్రకారం మేనమామలే మేనకోడలికి కట్నకానుకలు ఇవ్వాల్సి ఉంటుంది, చెల్లెలికి ఆర్థికభారం తగ్గించేందుకు మైరాలో భాగంగా వరుడు తరపు వారికి మేనమామలు కట్నాలు ఇస్తారు.
అందులో భాగంగానే ఈ ముగ్గురు సోదరులు తమ మేనకోడలికి వైభవంగా వివాహం చేసి భరీ కానుకలు అందజేశారు. అయితే ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ కట్నకానుకలు ఇవ్వలేదట. ఈ విషయంలో ఈ ముగ్గురు సోదరులు రికార్డును బ్రేక్ చేశారు. మేనకోడిలికి మాత్రమే కాదు మేనకొడుకుకు పెళ్లికి అయ్యే ఖర్చులను కూడా ఈ సంప్రదాయం ప్రకారం మేనమామలు భరించాల్సిందే.