వాహనంపై ‘కులం’ కనిపిస్తే అంతే సంగతి!
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వాహన చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రం మాత్రం కేంద్రం తీసుకొచ్చిన కొత్త వాహన చట్టాన్ని అమలుచేస్తూనే దానితో పాటు మరికొన్ని కొత్త రూల్స్‌ని అమల్లోకి తీసుకొని వచ్చింది. ఇక నుంచి వాహనాలపై కులం పేరు, ఊరి పేరు కనిపించడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. వాహనాలపై కులం పేరు, ఊరి పేరు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కింది. వాహనాలపై కులం, వృత్తులు, సంస్థలు, హోదాలను రాయడం వల్ల సమాజంలో కులతత్వంతో పాటు బేధాభిప్రాయాలు పెరుగుతాయంటూ రాజస్టాన్ సివిల్ రైట్ సంస్థ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో వాహనదారులు తమ సంస్థల పేర్లు, హోదాలను కూడా వ్యక్తిగత వాహనాలపై ప్రదర్శించకుండా చూడాలంటూ ఇప్పటికే జోధ్‌పూర్, జైపూర్ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు అందాయి. అలాగే హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన వారి నుంచి రూ.1000 జరిమానా వసూల్ చేసి అదే డబ్బుతో వారికి ఉచితంగా హెల్మెట్‌ను ఇస్తున్నారు. వాహనదారుల్లో మార్పు కోసం ఇలా చేస్తున్నామని రాజస్థాన్ పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో తలపాగా పెట్టుకోవడం ఆచారమని.. వారిలో మార్పు వచ్చేందుకు హెల్మెట్‌లు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి రూల్స్ తీసుకొని వచ్చిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ కావడం విశేషం.