ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో మద్యం తాగి ‘నాగిని’ డాన్స్ చేసినందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన 10 రోజుల క్రితం రాజస్థాన్‌లోని జలోర్‌లో చోటు చేసుకుంది. శిక్షణా శిబిరం నుంచి వచ్చిన వీడియో ఫుటేజ్‌లో ముగ్గురు ఉపాధ్యాయులు నాగిని నాట్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉండగా, ఒకరు శిక్షణ ఇవ్వడానికి వచ్చిన ట్రైనర్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఉపాధ్యాయుల్లో ఒకరిని ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. మిగతా ఇద్దరికి షో-కాజ్ నోటీసులు జారీ చేశారు.
‘నృత్యం, ఉల్లాసభరితమైన ఇలాంటి కార్యకలాపాలను నిర్వహించడంలో ఎలాంటి హాని లేదు. కానీ, ప్రవర్తనా నియమావళిని పాటించాల్సిందే’ అని జలోర్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ రోష్వాల్ తెలిపారు. అయితే, సస్పెన్షన్ ఉత్తర్వులపై ఆ శాఖలోని కొందరు ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘విరామ సమయంలో ఏదో వారు ఇతర ఉపాధ్యాయులతో ఆనందంగా గడిపారు. ఇందులో అసభ్యకరంగా, హానికరంగా ఏముందో అర్థం కావడంలేదు. ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన సహోద్యోగులతో సరదాగా సమయం గడపడం తప్పా?’ అని ప్రశ్నించాడు ఓ ఉపాధ్యాయుడు.