65 ఏళ్ల రాజ్‌బబ్బర్ కూడా రాజీనామా చేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

65 ఏళ్ల రాజ్‌బబ్బర్ కూడా రాజీనామా చేశాడు

March 21, 2018

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పార్టీలోని వయోధికులు కాస్త అడ్డు తప్పుకుని యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు కలకలం రేపుతోంది. 72 ఏళ్ల వయసున్న గోవా కాంగ్రెస్ చీఫ్ శాంతారాం నాయక్ రాజీనామా చేసి ఒక రోజు గడవక ముందే మరో కీలక రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు వదులుకున్నాడు.

యూపీ కాంగ్రెస్ చీఫ్, బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆయన వయసు 65 ఏళ్లు. ఈ వయసు మన దేశ రాజకీయాల్లో వయోధిక వయసు కింద పరిగణించడం లేదు. అయితే రాజ్ బబ్బర్ రాజీనామాను అధిష్టానం ఇంకా ఆమోదించలేదు.

రాజ్ బబ్బర్ నాయకత్వంలో పార్టీ యూపీలో సరైన ఫలితాలు సాధించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే బలమైన బీజేపీని ఆయనొక్కడూ ఎలా ఎదుర్కొంటారని, ఓటమి బాధ్యత మొత్తం పార్టీదే అని వాదనలూ ఉన్నాయి. దీనికి తాజాగా రాహుల్ పిలుపు తోడవడంతో బబ్బర్ రాజీనామాకు దారితీసింది. రాజీనామాప ఆయన స్పందిస్తూ.. ‘నాకు యూపీలో ఒక బాధ్యత అప్పగించారు.

శక్తివంచన లేకుండా  పనిచేశాను. కొన్ని లోపాలు ఉండొచ్చు. అధిష్ఠానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను’ అని ఆయన అన్నారు. బబ్బర్ రాజీనామా ఆమోదం పొందితే ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్‌ నియమితులయ్యే అవకాశముంది.