నాకు కాషాయ రంగు పూయకండి.. రజినీ కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

నాకు కాషాయ రంగు పూయకండి.. రజినీ కౌంటర్

November 8, 2019

తమిళ సుపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీపై రోజుకో ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఇంతకీ రజినీ మనసులో ఏం ఉంది. ఆయన సొంత పార్టీ పెడతారా లేక బీజేపీ దగ్గర అవుతారా అనే చర్చ సాగింది. ఈ సమయంలోనే ఆయనపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. శుక్రవారం రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ నూతన కార్యాలయంలో ఆయన స్పందించారు. 

తాను బీజేపీ ట్రాప్‌లో పడబోనంటూ కుండబద్ధలు కొట్టారు.‘నాకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోంది. నేను బీజేపీ వ్యక్తిని కాదు. నాకు కాషాయ రంగు వేయకండి. గొప్ప రచయిత అయిన తిరువళ్లువర్ లాంటి వ్యక్తులపై కూడా రాజకీయాలు చేయకండి‘ అంటూ వ్యాఖ్యానించారు. రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇక ఆయన బీజేపీకి దూరంగా ఉంటారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. 

కాగా ఇటీవల తంజావూరులో ప్రముఖ తమిళ రచయిత తిరువళ్లువర్ విగ్రహానికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ కాషాయవస్త్రం కట్టి మెడలో రుద్రాక్ష మాల వేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ దుమారం నడిచింది. తాజాగా రజినీ వ్యాఖ్యలతో బీజేపీ ఇరకాటంలో పడిపోయినట్టు అయింది.