కరోనా సంక్షోభంలో మద్యం అమ్మకాలపై సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి. మద్యం దుకాణాల వద్ద ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా మద్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో మళ్లీ కరోనా వ్యాపించక మానదని ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా మద్యం అమ్మకాలపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఘాటుగా స్పందించారు. కరోనా క్లిష్ట కాలంలోనూ సామాన్యుల నుంచి సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వాలు చూడటం సరికాదని అసహనం వ్యక్తంచేశారు. ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. మద్యం అమ్మకాలు ఇలాగే కొనసాగితే మరోసారి అధికారంలోకి రారన్న విషయం మర్చిపోవద్దని అన్నాడీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
కాగా, తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నాయి. మరోవైపు మద్యం అమ్మకాలు జోరుగా సాగడం ఆందోళనకు గురిచేస్తోంది. మద్రాస్ హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తక్షణమే మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోంది.