నేతాజీ గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాజ్‌నాథ్ సింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

నేతాజీ గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

November 12, 2022

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఎవరికీ తెలియని ఓ రహస్యాన్ని బహిరంగపరిచారు. గ్రేటర్ నోయిడాలోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందు ఆజాద్ హింద్ ఫౌజ్ పేరిట సైన్యాన్ని ఏర్పాటు చేసిన నేతాజీ.. అదే క్రమంలో ప్రభుత్వాన్నికూడా ఏర్పాటు చేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని వెల్లడించారు. నేతాజీ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని, అవి తెలిస్తే ప్రజలే ఆశ్చర్యపోతారని వ్యాఖ్యానించారు.

తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు 300 పత్రాలు ప్రజలకు అందుబాటులో ఉంచానని, ఆయన కుటుంబసభ్యులను కూడా కలిశానని తెలిపారు. అవిభక్త భారత దేశానికి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం అతి తక్కువ మందికి తెలుసన్నారు. ఆజాద్ హింద్ సర్కార్ పేరుతో ఏర్పడ్డ ఆ ప్రభుత్వాన్ని మొదటి స్వదేశీ సర్కార్ అని పిలవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ‘1943 అక్టోబర్ 21వ తేదీన సుభాష్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి ప్రభుత్వానికి ఉన్నట్టే స్వంత పోస్టల్ స్టాంపులు, కరెన్సీ, రహస్య ఇంటెలిజెన్స్ సర్వీస్ ఉన్నాయి. పరిమిత వనరులతో ఇటువంటి వ్యవస్థను నెలకొల్పడం సాధారణ విషయం కాద’న్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు సరైన గౌరవం కల్పించడానికి నిరంతరంగా ప్రయత్నించామని, ఆయన రచనలు ఉద్దేశపూర్వకంగా చాలా వరకు వెలుగులోకి రాకుండా గత ప్రభుత్వాలు చేశాయని విమర్శించారు.