బలం లేకున్నా బలరాం పోటీ.. కాంగ్రెస్ వ్యూహం ఇదే.. - MicTv.in - Telugu News
mictv telugu

బలం లేకున్నా బలరాం పోటీ.. కాంగ్రెస్ వ్యూహం ఇదే..

March 14, 2018

తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. ఒక అభ్యర్థి విజయం సాధించాలంటే 30 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.  90 మంది ఎమ్మెల్యేల బలమున్న టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న ముగ్గురూ సులభంగా విజయం సాధిస్తారన్నది సుష్పష్టం. అయినా కాంగ్రెస్.. తన సీనియర్ గిరిజన నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ను బరిలోకి దింపింది. 13 మంది ఎమ్మెల్యేలున్న హస్తం పార్టీ ఏ ధైర్యం, ఏ అంచనాతో బలరాంతో పోటీ చేయిస్తోందన్నదానిపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ఎంఐఎం టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించడం, బద్ధశత్రువైన బీజేపీ ఓటేసే చాన్సే లేకపోవడం నేపథ్యంలో కాంగ్రెస్ గిరిగీసి నిలబడ్డం ఆశ్చర్యకరమే..

ఫిరాయించిన వారిపై వేటు, వాటిపై ఆశ..

గెలుపు ఎండమావిలా కనిపిస్తున్నా రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్ బరిలోకి దూకడం వెనుక పక్కా వ్యూహం ఉంది. అధికారి టీఆర్ఎస్‌ను, తమ గూటిని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకే కాంగ్రెస్ బలరాంను ముగ్గులోకి దించినట్లు కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసే అభ్యర్థులు తాము ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో చెప్పాల్సి ఉంటుంది. పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాలి. దీంతో కాంగ్రెస్ నుంచి అధికార పార్టీలోకి వెళ్లిన వారు చిక్కుల్లో పడతారు.

అనర్హత వేటు..

ఫిరాయింపుదారులకు విప్ జారీ చేసి వారి ప్రతిష్టను దెబ్బతీయడమే కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే విప్ జారీ చేయగలరేగాని, ఎవరికి ఓటేయాలో అందులో పేర్కొనే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం ఖాయం. అయినప్పటికీ ఫిరాయింపు ఎమ్మేలపై అనర్హత వేటు వేయించేందుకు ఇదొక మార్గంగా పనికొచ్చే అవకాశం ఉంటుంది. 2011లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కోటా నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, రవీందర్ రెడ్డి, సమ్మయ్యలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి, అనర్హతకు గురయ్యారు. దీంతోపాటు మరికొన్ని ఇలాంటి గతచరిత్రలను దృష్టిలో ఉంచుకుని ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం బలరాం నాయక్‌ను బరిలోకి దింపినట్లు భావిస్తున్నారు.

ఓడితో పోయేదేముంది?

టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసుకుని దూకుడు పెంచాలన్న అధిష్టానం అదేశాల ప్రకారం.. కాంగ్రెస్ చట్టసభల్లోనూ, బయటా ఆందోళన, ఆరోపణలను తీవ్రం చేస్తోంది. అందివచ్చిన ఏ అవకాశాన్నీ చేజార్చుకోకుండా చివరకు అసెంబ్లీలో హెడ్‌సెట్ లనూ విరిసికొడుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ కూడా ఇలాంటి దూకుడే. ఓడితే పోయేదేమీ లేకపోవడం, అధికార పార్టీని, ఫిరాయింపుదారులను ఇబ్బందిపెట్టే అవకాశమూ ఉండడంతో కాంగ్రెస్ ఓటమి భయాన్ని లెక్కచేయకుండా బరిలోకి దిగింది..!