అంతా స్కెచ్ ప్రకారమే.. డీఎస్ జంప్.. కాంగ్రెస్ వయా టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ! - MicTv.in - Telugu News
mictv telugu

అంతా స్కెచ్ ప్రకారమే.. డీఎస్ జంప్.. కాంగ్రెస్ వయా టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ!

July 11, 2019

Rajya sabha mp d srinivas.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని, ఒపీనియన్ చేంజ్ చేయకపోతే పొలిటీషియన్ కాలేడనే నుడికారాలు మరోసారి రుజువయ్యాయి. రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైంది! కాంగ్రెస్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం కాషాయ గుమ్మానికి చేరుకుంది. డీఎస్ ఈ రోజు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలపై ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. నిన్న ఢిల్లీలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీకి హాజరైన డీఎస్ ఒక్క రోజు తిరగకుముందే కమలదళ నేతను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

కొన్నాళ్లుగా దూరంగా.. 

డీఎస్ కొన్నాళ్లుగా గులాబీదళ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవితతో విభేదాలతోపాటు తన భవిష్యత్తు, తన కొడుకుల భవిష్యత్తుపై వ్యూహాలు దీనికి కారణం. అందుకే ఎన్నికల సమయంలో ఆయన గుంభనంగా ఉండిపోయారు. కవితపై పోటీ చేసి, రైతుల నిరసన నేపథ్యంలో గెలిచిన తన కొడుకు అరవింద్‌కు అండగా నిలబడ్డారు. దీంతో టీఆర్ఎస్‌తో ఆయన అనుబంధం ముగిసినట్లేనని అప్పుడే సంకేతాలు అందాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టీఆర్ఎస్ అధిష్టానంపై ఆయనపై చర్యలు తీసుకోనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో డీఎస్ అమిత్ షాతో భేటీ అయ్యారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే..

నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు చాలా కాలంగా డీఎస్‌పై ఫిర్యాదు చేస్తున్నారు. ఇంకా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని, ఎన్నికల్లో సహకరించడం లేదని ఆరోపణలు చేశారు. కాలేజీ విద్యార్థినులపై వేధింపుల కేసులో డీఎస్ పెద్ద కొడుకు సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం, ‘నిర్భయ’ కేసు పెట్టడం కలకలం రేపింది. ఇది డీఎస్‌కు ఆగ్రహం తెప్పించింది. తర్వాత ఆయన అనుచరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో విభేదాలు మరింత ముదిరాయి. వారిలో ఒకరైన భూపతి రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కూడా దక్కింది. డీఎస్ కూడా కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారని, అయితే రాజ్యసభ సభ్యత్వం పోతుందని వెనక్కి తగ్గారని భావించారు. అయితే ఈ పరిణామాలకు ముందు నుంచి డీఎస్ పక్కా వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఆయన కొంత వెనక్కి తగ్గారని, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు తెచ్చుకోవడంతో మళ్లీ ఆలోచనలో పడ్డారని సన్నిహితులు చెబుతున్నారు. 

బీజేపీ వ్యూహంలో భాగమా? 

తెలంగాణపై కన్నేసిన బీజేపీ.. కాంగ్రెస్ నుంచి వీలైనంత మందిని చేర్చుకుని బలపడ్డానికి వ్యూహాలు పన్నుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు రావడం వెనక గట్టి ప్రయత్నాలే జరిగినట్లు తెలుస్తోంది. అమిత్ షా, రాజ్‌నాథ్, రాంమాధవ్ తదితర బీజేపీ నేతలు తరచూ తెలంగాణలో పర్యటిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లలోని అసంతృప్త నేతలతో భేటీ అవుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ ఉదంతం దీనికి తాజా ఉదాహరణ. అటు కాంగ్రెస్ నుంచి, వీలైతే ఇటు టీఆర్ఎస్ నుంచి కీలక నేతలను లాక్కోవాలని బీజేపీ యత్నిస్తోంది. 

ఇదీ వరస.. ఓడించిన పార్టీలోకే

డీఎస్ సరిగ్గా 30 ఏళ్ల కిందట 1989ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. తొలి పర్యాయమే మంత్రి అయ్యారు. 1998లో పీపీసీ పగ్గాలు చేపట్టిన డీఎస్ 2004లోనూ ఆ స్థానం దక్కించుకున్నారు.  2009 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదంటూ 2015లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అందులో ఇమడలేకపోయారు. అత్యంత సీనియర్ నేతగానే కాకుండా పీసీపీ చీఫ్, మంత్రిగా కీలక పదవులు చేపట్టిన డీఎస్ రాజకీయ మనుగడ కోసం పార్టీలు మారుతూ రావడం విశ్లేషకులకు విస్మయం కలిగిస్తోంది.