సాకారమవుతున్న ట్రాన్స్‌జెండర్ల కల.. బిల్లుకు రాజ్యసభ ఆమోదం - MicTv.in - Telugu News
mictv telugu

సాకారమవుతున్న ట్రాన్స్‌జెండర్ల కల.. బిల్లుకు రాజ్యసభ ఆమోదం

November 27, 2019

Rajya Sabha passes Transgender Persons (Protection of Rights) Bill, 2019

ట్రాన్స్‌జెండర్లూ మనుషులే, వాళ్లను మనుషులుగా గుర్తించాలి, వివక్ష చూపించరాదు, విద్యా ఉద్యోగ రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిందే. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్ల పోరాటానికి ఫలితం దక్కింది. ‘ట్రాన్స్‌జెండర్ల హక్కుల రక్షణ బిల్లు-2019’ను మంగళవారం రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు ఆగస్టు 5న లోక్‌సభ ఆమోదం పొందింది. ఈనెల 25వ తేదీన ఈ బిల్లును సామాజిక న్యాయం, సాధికార శాఖ మంత్రి తాపర్ చంద్ గెహ్లాట్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుపై వివిధ పక్షాల సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. మరోవైపు లోటుపాట్లను లేవనెత్తారు. అనేక తర్జనభర్జనల అనంతరం ఉభయ సభలు బిల్లును ఆమోదించడంతో చట్టంగా మారడమే మిగిలింది. 

 

ఈ బిల్లులోని ముఖ్యాంశాలు..   

విద్యా, ఉద్యోగాలు, వైద్యం, ప్రజా సదుపాయాలు, వస్తు సేవలు, ప్రయాణం, ప్రజా సదుపాయం వినియోగం, అద్దె నివాసం పొందడం, ప్రభుత్వ లేదా ప్రైవేట్ పదవులు పొందడం, ఆస్తుల కొనుగోలు మొదలగు అంశాల్లో ఇతరులతో పాటు ట్రాన్స్‌జెండర్లకు సమాన హక్కులు ఉంటాయి. అలాగే వారికి తమ సొంత ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి జీవించే హక్కు ఉంటుంది. ట్రాన్స్‌జెండర్ గుర్తింపు పత్రానికై జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ట్రాన్స్ జెండర్లను ఇంటినుంచి లేదా గ్రామం నుంచి గెంటేయడం, వారితో వెట్టిచాకిరి చేయించుకోవడం, వారిని శారీరకంగా, భౌతికంగా హింసించినా నేరంగా పరిగణిస్తారు. ఇందుకు ఆర్నెల్ల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రి అధ్యక్షతన జాతీయ స్థాయిలో ట్రాన్స్‌జెండర్ల కోసం ఒక మండలి(ఎన్‌సీటీ) ఏర్పడుతుంది.