మూడు రాజ్యసభ సీట్లూ టీఆర్ఎస్‌కే   - MicTv.in - Telugu News
mictv telugu

మూడు రాజ్యసభ సీట్లూ టీఆర్ఎస్‌కే  

March 23, 2018

అంతా అనుకున్నట్లే జరిగింది. తెలంగాణ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియగా తర్వాత ఫలితాలు ప్రకటించారు. మొత్తం 108 ఓట్లు పోలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థులు బండ ప్రకాశ్‌కు 33 ఓట్లు, బడుగుల లింగయ్యకు 32 ఓట్లు, జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌కు 32 ఓట్లు దక్కాయి. దీంతో వారిని విజేతలుగా ప్రకటించారు. దీంతో అసెంబ్లీ వద్ద గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

బలరాం నాయక్‌కు 10 ఓట్లు

బలం లేకపోయినా పంతం కోసం పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ 10 ఓట్లు దక్కించుకున్నారు. వాస్తవానికి 11 ఓట్లు రావాల్సి ఉన్నా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మధవరెడ్డి ఓటు చెల్లకుండా పోయింది. ఆయన కాంగ్రెస్‌ ఏజెంటుకు చూపించి ఓటు వేయడంతో రిటర్నింగ్‌ అధికారి ఈసీకి దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం దొంతి మాధవరెడ్డి ఓటును అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. తమ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ప్లేటు ఫిరాయించి, క్రాస్ ఓటింగ్ చేశారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ప్రభావం చూపలేదు. అసెంబ్లీలో మొత్తం 119 మంది సభ్యులు ఉండగా.. 108 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేయగా, టీడీపీ, బీజేపీ, సీపీఎం ఎమ్మెల్యేలు పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారు.