21 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించిన సాఫ్ట్‌వేర్ - MicTv.in - Telugu News
mictv telugu

21 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించిన సాఫ్ట్‌వేర్

October 28, 2019

Election..

ఎన్నికల సంగ్రామం అంటే అభ్యర్థులు విజయావకాశాలపై భేరుజు వేసుకుంటారు. నియోజకవర్గంలో తమ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి సర్వేలు, వ్యూహకర్తల అంచనాలను నమ్ముకుంటారు. తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ సంగ్రామంలో ఎన్డీయే, యూపీఏ పోటాపోటీగా నిలిచాయి. అయితే ఈసారి ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ సాఫ్ట్‌వేర్ కీ రోల్ పోషించినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఉపయోగించుకొని ఏకంగా 21 మంది ఈసారి శాసనసభలో అడుగు పెట్టారు.

యూనిటీ ఇన్ఫోటెక్ అనే ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కంపెనీ సంస్థ 2010లో రాజ్యకర్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీన్ని ఉపయోగించుకొని చాలా మంది నేతలు తమ తలరాతను మార్చినట్టుగా చెబుతున్నారు. ఈఎన్నికల్లో రాజ్యకర్త సాఫ్ట్‌వేర్ వాడిన 37 మందిలో 21 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఈసారి రాజ్యకర్తను నమ్ముకున్నారు. దీన్ని వాడిన వారిలో మెజార్టీ సభ్యులు విజయం సాధించడంతో దీనిపై ఇప్పుడు రాజకీయంగా చర్చసాగుతోంది. 

ఈ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుంది : 

ఎన్నికల వ్యూహకర్తల అంచనాలకోసం దీన్ని వాడుతున్నారు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఓటర్లను గుర్తించడం దీని ద్వారా సులభతరం అవుతోంది. ఒపీనియన్ పోల్స్, సర్వేలు నిర్వహిస్తూ అభ్యర్థులు తమ ప్రచారంలో ఉండగానే పరిస్థితి అంచనా వేసి ఈ సంస్థ వారికి సమాచారాన్ని చేరవేస్తుంది. వారికి వచ్చిన ఓటింగ్ శాతాన్ని ఎక్కడ బలంగా ఉన్నారు..? ఎక్కడ బలహీనంగా ఉన్నారో తెలుసుకొని తమ ప్రాభల్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. 

2014 ఎన్నికల్లో పలువురు సీనియర్ నేతలు కూడా ఈ సంస్థను సంప్రదించినట్టు సంస్థ ఎండీ హితేష్ జైన్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారానికి వీలుగా అభ్యర్థులపై డాక్యుమెంటరీ ఫిల్మ్‌లు కూడా తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. వార్ రూమ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థుల కోసం కాల్ సెంటర్ల ద్వారా ఓటర్ల నాడి పసిగట్టడంతో పాటు మెసేజ్‌ల ద్వారా అభ్యర్థి తరుపున ప్రచారం నిర్వహించనున్నట్టు హితేష్ తెలిపారు.