ప్రతి అన్నా, ప్రతి చెల్లెలూ విని తీరాల్సిన పాటలు..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రతి అన్నా, ప్రతి చెల్లెలూ విని తీరాల్సిన పాటలు.. 

July 31, 2020

Rakhi raksha bandhan special songs from tollywood movies 

రాఖీ పూర్ణిమ వచ్చేస్తోంది. అన్నలకు రక్షను కట్టేందకు చెల్లెమ్మలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిన్నప్పటి తీపి గురుతులను నెమరేసుకుంటున్నారు. కమ్మని పాటలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. అసలు ఏ పండగైనా పాటలు తప్పనిసరి. సంక్రాంతి, అట్లతద్దె, దీపావళి, దసరా.. ఎన్నో పండగలు.. ఎన్నో పాటలు. మరి రాఖీ పండగకు మాత్రం పాటలుండవా ఏంటి? ఎందుకు లేవూ, బోలెడన్ని పాటలు ఉన్నాయి. పాట అంటే ఇప్పుడు అందరికీ సినిమా పాటలే గుర్తుకొస్తాయి గాని శతాబ్దాల నాటి జానపదాల్లోనూ అన్నాచెల్లెళ్లపై చక్కని చిక్కని పాటలే ఉన్నాయి. 

‘అన్నరా పెద్దన్న ఉయ్యాలో పిల్లనియ్యారయ్యా ఉయ్యాలో’ అని ఓ చెల్లెలు అడుగుతుంది. అన్న మౌనంగా ఉంటాడు. వదిన నోరు చేసుకుని, ‘మేనోల్ల కియ్యమ మెప్పియ్య లేమమ్మ, బయటోల్లకియ్యొచ్చు మెప్పించుకోవచ్చు’ అని తేల్చేస్తుంది. ఇక తెలుగు సినిమాల్లోని పాటల గురించి తెలుసుకుందాం.. 

ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్లుగా నటించిన ‘రక్తసంబంధం‘(1962)లోని పాటలన్నీ బాగానే ఉంటాయి. ‘రక్తసంబంధం ఇదే రక్తసంబంధం హృదయాలను కలిపేది కలకాలం నిలిచేది నిజమైన జన్మ బంధం..’ పాట కన్నీళ్లు పెట్టిస్తుంది. ‘చందురుని మించు అందుములొలికించు..’ పాట కూడా గుండెను బరువెక్కిస్తుంది. 


బంగారుగాజులు(1968) చిత్రంలోని ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి.. కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి…’ పాట చాలా కవితాత్మకంగా సాగిపోతుంది.. 

‘‘ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై.
ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై.
చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో.. ’ అంటూ హృదయాలను హత్తుకుంటుంది. 

ఆడపడచు(1976) చిత్రంలో సుశీల కంఠంతో వినిపించే ‘అన్నా… నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా నీ అనురాగం… పుట్టిన రోజున మీ దీవేనలే… వెన్నెల కన్నా చల్లదనం.. ఓ అన్నా నీ అనురాగం..’ పాట కూడా మాణిక్యమే. డ్రైవర్ రాముడు(1979)లో ‘ఏమని వర్ణించను.. ’ కూడా అన్నాచెల్లెళ్ల పాటే. దొరబాబు(1974) చిత్రంలో ‘ఆ దేవుడెలా ఉంటాడని.. ఎవరైన అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేనూ.. అనురాగమెలా ఉంటుందని.. ఎవరైనా అడిగితే మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేనూ..’ పాట కూడా వినితీరాల్సిందే..