తాను ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదని బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న నటి రకుల్ ప్రీత్‌సింగ్ ఎన్సీబీ (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అధికారుల ముందు చెప్పినట్టు తెలుస్తోంది. ఈరోజు ఆమెను ఎన్సీబీ అధికారులు విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. విచారణలో రకుల్ కీలక విషయాలను వెల్లడించినట్టు సమాచారం. రియా చక్రవర్తితో డ్రగ్ చాటింగ్ చేసినట్టు ఆమె ఒప్పుకున్నా.. తాను డ్రగ్స్ ఎప్పుడూ వాడలేదని వివరించింది. మరోవైపు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులతో కూడా తనకు సంబంధం లేదని స్పష్టంచేసింది. ఇదిలావుండగా విచారణలో రకుల్ నలుగురు స్టార్ల పేర్లను వెల్లడించినట్టు ఓ మీడియా సంస్థ తన కథనంలో తెలిపింది.
కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ ప్రసాద్ ఈ నలుగురికీ డ్రగ్స్ సరఫరా చేసేవాడని చెప్పినట్టు వివరించింది. క్రమం తప్పకుండా అతను మాదకద్రవ్యాలను సేకరించేవాడని, పలువురు సెలబ్రిటీలకు వాటిని సరఫరా చేసేవాడని పేర్కొంది. వారిలో కనీసం నలుగురు స్టార్లు ఉన్నారని చెప్పినట్టు వివరించింది. మరోవైపు డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఎదుట హాజరైన టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా, తాను, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నామని.. సదరు గ్రూప్ ద్వారానే మాదక ద్రవ్యాల గురించి చర్చించేవాళ్లమని కరిష్మ చెప్పారని సమాచారం. అంతేగాక ఈ గ్రూప్‌నకు దీపికొణె అడ్మిన్‌గా ఉండేవారని, తరచుగా హష్(డ్రగ్) గురించి అడిగేవారని తెలిపినట్టు వివరించింది. కాగా, రకుల్ ప్రీత్ సింగ్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారని.. ఆమె స్టేట్మెంట్ను విశ్లేషించి, కోర్టుకు సమర్పిస్తామని విచారణ అనంతరం, ఎన్సీబీ ముంబై శాఖ డైరెక్టర్ జనరల్ అశోక్ జైన్ వెల్లడించారు.