అది కరోనా మందు కాదు..మాట మార్చిన రాందేవ్ - MicTv.in - Telugu News
mictv telugu

అది కరోనా మందు కాదు..మాట మార్చిన రాందేవ్

June 30, 2020

ram dev

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను కట్టడిచేయానికి కరోలిన్‌ అనే మందును కనిపెట్టినట్లు పతంజలి కంపెనీ గత మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. యోగా గురువు రాందేవ్‌ బాబా పతంజలి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా లక్షణాలు కలిగి ఉన్న వంద మంది రోగులపై ఈ మందును ప్రయోగించగా, వారిలో దాదాపు 65 మంది పూర్తిగా కోలుకున్నారని పతంజలి కంపెనీ పేర్కొంది. దీంతో పతంజలి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ రాందేవ్‌ బాబా, పతంజలి చైర్మన్‌ బాలకృష్ణపై పలువురు మండిపడ్డారు. దీంతో భారత ఆయుష్‌ మంత్రిత్వ శాఖ కరోనిల్‌ ప్రకటనలను నిషేధించింది. దీనిపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం స్పందిస్తూ కరోనా నిరోధక మందుల తయారీకి పతంజలి కంపెనీ ఎలాంటి లైసెన్స్‌లు తీసుకోలేదని, దగ్గు నివారణ మందనుకొనే తాము కరోలిన్‌ మందుకు అనుమతించామని పేర్కొంది. 

తాజాగా కరోనిల్ విషయంలో పతంజలి నిర్వాహకులు యూటర్న్‌ తీసుకున్నారు. తాము కరోనా నివారణకు ఎలాంటి మెడిసిన్‌ తయారు చేయలేదంటూ మాట మార్చారు. ‘కరోనా కిట్‌’ పేరిట ఎలాంటి అమ్మకాలు చేపట్టలేదని మంగళవారం వివరణ ఇచ్చారు. కరోనా కిట్‌ పేరును ఎక్కడా వాడటం లేదు. మందును తయారు చేయలేదు. దివ్య స్వసారి వతి, దివ్య కరోనిల్‌ టాబ్లెట్‌, దివ్య అను టేల్‌ అనే మెడిసిన్‌తో కూడిన ప్యాకేజీ మాత్రమే షిప్పింగ్‌ చేస్తున్నాం. కరోనిల్‌ కిట్‌ అనే కిట్‌ను విక్రయించడం లేదు. అంతేకాదు.. అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని కూడా ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. కేవలం ఈ మందులకు సంబంధించిన ప్రయోగం విజయవంతమైన విషయాన్ని మాత్రమే మీడియా ముందు తెలిపామని పతంజలి నిర్వాహకులు వెల్లడించారు.