విలక్షణ నటుడితో ఆర్జీవీ కొత్త సినిమా.. క్రేజ్ మామూలుగా లేదు - MicTv.in - Telugu News
mictv telugu

విలక్షణ నటుడితో ఆర్జీవీ కొత్త సినిమా.. క్రేజ్ మామూలుగా లేదు

March 24, 2022

rgv

సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లు చాలా క్రేజీగా ఉంటాయి. అలాంటి కాంబినేషన్ ఒకటి ఇప్పడు కుదిరింది. ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమాను గురువారం ప్రకటించాడు. కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్రతో ‘ఆర్’ అనే సినిమాను తీస్తున్నట్టు వెల్లడించాడు. భారత దేశంలో నమ్మశక్యం కాని నేరాలు చేసిన ఓ గ్యాంగ్‌స్టర్ జీవితం ఆధారంగా సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించనున్నట్టు తెలిపాడు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశాడు. అందులో చేతిలో కత్తి పట్టుకొని దాన్నే తదేకంగా చూస్తున్న ఉపేంద్ర ముఖంలో హావభావాలు వేరే లేవెల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సినిమాను ఏ స్క్వేర్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఇక కథల విషయంలో తనదైన మార్కు చూపించే ఉపేంద్ర మొదటిసారి ఆర్జీవీతో చేయడం సినీ జనాల్లో ఆసక్తి రేపుతోంది. ఉపేంద్ర కెరీర్ మొదట్లో బాగా పేరు తీసుకొచ్చిన ఏ, రా, ష్, ఓం వంటి సినిమాల పేర్లు ఏక అక్షరంతో ఉన్నాయి. ఇప్పడు చాన్నాళ్ల తర్వాత అదే సెంటిమెంటును రిపీట్ చేస్తున్నారు. కాగా, ఉపేంద్ర పలు తెలుగు సినిమాల్లోనూ నటించాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో ఈ తరం ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపేంద్రకు చెప్పుకోదగిన సంఖ్యలో అభిమానులున్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే మరెంత విభిన్నంగా ఉండబోతోందో వేచి చూడాలి.