వణుకు పుట్టించేలా ఆర్జీవీ ‘దహనం’.. ఫ్రీగా చూడొచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

వణుకు పుట్టించేలా ఆర్జీవీ ‘దహనం’.. ఫ్రీగా చూడొచ్చు

April 4, 2022

bfb

క్రైమ్ థ్రిల్లర్లను రూపొందించడంలో రాంగోపాల్ వర్మది ప్రత్యేక శైలి. ఇప్పుడు ఆయన నిర్మాణ సంస్థ నుంచి మరో క్రైమ్ మూవీ రాబోతోంది. అయితే ఈ సారి వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ‘దహనం’అనే టైటిల్ పెట్టిన ఈ వెబ్ సిరీస్ మొత్తం ఏడు భాగాలుగా వస్తోంది. ఏప్రిల్ 14న ఎంఎక్స్ ప్లేయర్‌లో విడుదల చేస్తామని వర్మ ప్రకటించారు. ఇక కథ విషయానికొస్తే.. అనంతపురం జిల్లాలోని కమ్యూనిస్టు నేత శ్రీరాములు హత్య ఆ ప్రాంతంలో సంచలనం రేపుతుంది. రాములు పెద్ద కొడుకు హరి, ఓ నక్సలైట్. అడవిలో ఉంటూ ప్రజల తరపున భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. ఈ క్రమంలో తండ్రి హత్య వార్త విన్న హరి, ప్రతీకారంతో రగిలిపోతుంటాడు. భూస్వాములకు, హరికి మధ్య జరిగే పోరాటం ఆసక్తి రేపుతుంది. ఈ పోరాటంలో హరి తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడా? లేదా? అనేది తెరమీద చూడాలి.

ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రం ప్రతీకారం, రక్తపాతం నేపథ్యంలో రూపొందింది. ఈ సిరీస్ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘ఇది నా మొదటి వెబ్ సిరీస్. కంటికి కన్ను సిద్ధాంతాన్ని నమ్మి వెళితే ప్రపంచాన్ని అంధకారంగా మార్చడంలో మనం విజయం సాధిస్తామని మహాత్మ గాంధీ చెప్తారు. మహా భారతంలో ప్రతీకారం అనేది ఓ స్వచ్ఛమైన భావోద్వేగమని చెప్పారు. ఈ సిరీస్‌లో ప్రతీకారంతో పాటు దాని పర్యవసానాలు కూడా చూపించాం. ఊపిరి బిగబట్టేలా ఈ సినిమాను తీయడం జరిగింద’ని వెల్లడించారు. అంతేకాక, ‘ఈ షోలో నటీనటుల టాలెంటును పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నాము. ఈ విషయంలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆతృతగా ఎదురు చూస్తున్నామ’ని వివరించారు. తెలుగులో రూపొందిన ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో డబ్బింగ్ చేశారు. ఈ ఏడు ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎంఎక్స్ ప్లేయర్‌లో ఉచితంగా చూడొచ్చు.