వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలు ఎంత వివాదంగా ఉంటాయో అతను మాట్లాడే తీరు కూడా అలాగే ఉంటుంది. దేనికీ తిన్నగా సమాధానం చెప్పడే అని వర్మను ఆడిపోసుకునేవాళ్లు పోసుకుంటూనే ఉంటారు. అయితే తనకు అలాంటివాళ్లే కావాలంటాడు వర్మ. తాజాగా వర్మ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. బ్రూస్లీ పుట్టినరోజు సందర్భంగా తాను తాజాగా రూపొందిస్తున్న ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ సినిమా టీజర్ ఇవాళ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వర్మ మీడియాతో ముచ్చటించాడు. తనకు తిట్టించుకోకపోతే అసలు నిద్రపట్టదని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి గిల్లడం అలవాటు. గిల్లించుకున్నవాళ్లు తిడుతుంటే వినే బుద్ధి నాలో డెవ్లప్ అయింది’ అని చెప్పాడు.
వరుసగా సినిమాలు ఇంత తొందరగా ఎలా తీస్తారు అన్న ప్రశ్నకు.. ‘అందరూ మెల్లగా తీస్తారు కానీ, నేను తొందరగా తియ్యను’ అని చెప్పాడు. మరి స్టార్ హీరోలతో ఎందుకు మీరు సినిమాలు తియ్యరు అని మరో ప్రశ్నకు వర్మ జవాబు చెప్పాడు. ‘నా కథలు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. వాటికి పేరున్న హీరోలు సరిపోరు’ అని వర్మ చెప్పాడు. భక్తి సినిమా తీసే ఉద్దేశం ఉందా అనే ప్రశ్నకు వర్మ చాలా వెరైటీగా సమాధానం చెప్పాడు. ‘నేను భక్తి సినిమా చేస్తే చంపేస్తారేమో. నిజంగా నేను చేసినా వెనకాల వీడేదో చేస్తున్నాడు అనుకుంటారు’ అని తెలిపాడు. కొత్తగా ‘మట్టి ముంతలో మజ్జిగన్నం’ సినిమా తీస్తున్నారని.. దాని విశేషాలు చెప్పమని మీడియా ప్రశ్నించింది. ఆ విషయం తనకు తెలియదంటూనే.. ఒకవేళ ఆ సినిమా తీస్తే కచ్చితంగా అది మీడియాకు అంకితం ఇస్తానని చెప్పాడు. అలాగే మహారాష్ట్ర రాజకీయాల మీద మరో ‘సర్కార్’ సినిమా తీసేందుకు తాజా రాజకీయాలు కథను అందించాయని వర్మ తెలిపాడు. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు సీక్వెల్ తీస్తే దానికి ‘కడప రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అని టైటిల్ పెడతానని చెప్పాడు.