రామారెడ్డి  మహనీయుడు : కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

రామారెడ్డి  మహనీయుడు : కేసీఆర్

August 22, 2017

బుద్వేల్ లో ఏర్పాటు చేయనున్న రెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. రెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి 10 కోట్లను తక్షణమే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

మరో 10 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తామన్నారు. ‘రాజా బహదూర్ వెంకట రామారెడ్డి మహనీయుడు. అప్పట్లో  పోలీస్  కొత్వాల్ పదవిలో 14 ఏండ్లు సుదీర్ఘకాలం పనిచేశారు. అన్ని కులాల ,మతాల వారి అభివృద్ధికి ఆయన కృషి చేశారు. ఆయన సేవలు మరువలేనివి. విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

అందుకే ఆయన సేవలకు గుర్తుగా పోలీస్ అకాడమికి వెంకట రామారెడ్డి పేరు పెట్టాం. ఏంతో మంది గొప్పవాళ్లు ఎన్నో గొప్పపనులు చేసినా సమైక్య  రాష్ట్రంలో వాళ్లకు గుర్తింపు దక్కలేదు. వాళ్లు పేరు గాని, ఊరుగాని ప్రస్తావనకు రాలేదు’ అని అన్నారు.

పేద ప్రజలు చదువుకోవాలని  వెంకట రామారెడ్డి గారు ఎంతో తపన పడ్డారని కేసీఆర్ చెప్పారు. రెడ్డి హాస్టల్ లో చదివిన చాలామంది ఉన్నత స్ధాయికి ఎదిగారని,  లక్షల మంది విద్యార్థుల బతుకులు మారాయని తెలిపారు. ‘రెడ్డి హాస్టల్ కు నేను చేసింది చంద్రునికో నూలుపోగు మాత్రమే. అయితే మీరు కోరినట్టే రెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించి మీ కోరిక తీర్చినందుకు, నాకూ ఓ కోరిక ఉంది.   

వానాకాలం సద్వులు కాకుంట కొత్త కోర్సులు ప్రవేశపెట్టి, ఆధునిక హాస్టల్ వెట్టాలె. ఎంతో మంది ఆ  రెడ్డి హాస్టల్ ద్వారా ఉన్నత స్ధానాలకు వెళ్లాలె. .దానికి ఏం సహాయం కావాలన్నా మేం సహకరిస్తం’ అని కేసీఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో హోంమంత్రి  నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.