నోరూరించే రంజాన్ వంటకాలు.. సిద్ధమా మరి!  - MicTv.in - Telugu News
mictv telugu

నోరూరించే రంజాన్ వంటకాలు.. సిద్ధమా మరి! 

May 21, 2020

Ramadan Special Recipes

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే పండుగ రంజాన్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారంతా రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తారు. అల్లా స్మరణ చేస్తూ.. భక్తి భావంతో గడుపుతారు. కానీ రంజాన్ అంటే ఒక్క ఉపవాసాలు మాత్రమే కాదు.. ఆ సమయాల్లో నోరూరించే వంటకాలు చేస్తారు. పండుగనాడు రకరకాల వంటకాలు చేసుకొని బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అయితే ఈ ఏడాది ఎప్పటిలాగే కాకుండా ఇలా కొత్త కొత్త వంటకాలు చేసుకుంటే మరింత ఆనందంగా గడవచ్చు. మరీ ఏఏ పదార్థాలతో ఎలాంటి వంటలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 . షీర్ కుర్మా : రంజాన్ రోజు దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఇంటిలో ఇది కచ్చితంగా తయారు చేస్తారు. చాలా మంది ఈ వంటకాన్ని ఇష్టపడతారు.

కావాల్సిన పదార్థాలు : సేమియా ఫ్యాకెట్, కప్పు పంచదార, లీటర్ పాలు, బాదం,పిస్తా, జీడిపప్పు, 20 యాలకులు,ఎండు ద్రాక్షా, అర చెంచా కుంకుమ పువ్వు,10 గ్రాములు తరిగిన ఖర్జూరం, మిల్క్‌మెయిడ్.

తయారీ విధానం : సేమియాని 2 నుంచి 3 నిమిషాలపాటు వేయించుకోవాలి. తర్వాత దానిలో పాలు,పంచదార వేసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత ఎండుద్రాక్ష, కొన్ని యాలకులు, బాధం,జీడిపప్పు,పిస్తా, ఎండు ద్రాక్ష వేసి పాలు దగ్గరికి వచ్చేలా ఉడికించాలి. చివరగా.. కుంకుమ పువ్వు, ఖర్చూరం పలుకులు వేసుకొని దింపేస్తే కావాల్సిన షీర్ కుర్మా రెడీ.

Ramadan Special Recipes

 

2 . పనీర్ పుదీనాకి చీక్ : 

కావాల్సిన పదార్థాలు : పుదీనా కట్ట, కప్పు పనీర్ ముక్కలు,ఉడికించిన క్యారెట్, షాజీరా, పెద్ద చెంచా బీన్స్ ముక్కలు, కప్పు ఉడికించిన బంగాళ దుంప,పచ్చి మిర్చి, ఒక కప్పు పెరుగు, తగినంత నూనె, ఒక ఉల్లిపాయ. 

తయారీ విధానం :  కళాయిలో నూనే వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంత వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కాయగూర ముక్కలు, పుదీనా, వేసి బాగా వేయించుకోవాలి. కొంత సేపటికి పన్నీర్ తురుము, సరిపడా ఉప్పు, షాజీరాని వేసి కలుపుకోవాలి.  ఇది చల్లారిన తర్వాత దాన్ని ఓ గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత పన్నీరు ముక్కలను ఓ ఊసకు గుచ్చి.. చికెన్ తందూరిని వేయించినట్టు దీన్ని కూడా వేయించాలి. బాగా వేగిన తరువాత పైన పెరుగు రాయాలి. ఆ తర్వాత దీన్ని సాస్ లేదా, పుదీనా చట్నీతో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. 

Ramadan Special Recipes

 

3 . మిరియాలతో కోడి కూర :

కావాల్సిన పదార్థాలు : పావు కిలో బోన్ లెస్ చికెన్,ఆవాలు, సోంపు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు,టేబుల్ స్పూన్ టమాటా పేస్ట్, ఒక స్పూన్ తరిగిన అల్లం, ఒక కప్పు ఉల్లిపాయలు, సరిపడా ధనియాలు,టీ స్పూన్ నల్ల మిరియాలు,ఆకుపచ్చ ఏలకులు, రెండు ఎండు మిర్చి

తయారీ విధానం  : ముందుగా మసాలా దినుసులను వేయించి మిక్సీ చేసి పెట్టుకోవాలి.  ఆ తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, సోంపు వేసుకోవాలి, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయాలి. మసాలా దినుసుల పొడి కూడా వేసి ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చాక అందులో టమాట పేస్టు కలపాలి. ఆ తర్వాత  చికెన్ వేసి బాగా కలియబెట్టాలి. దాంట్లో ఒక కప్పు నీళ్లు వేసి సన్నని మంట మీద పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి.. నోరూరించే మిరియాల కోడి కూర సిద్ధమైపోతుంది. 

Ramadan Special Recipes

 

4 . డబల్ కా మీఠా : 

కావాల్సిన పదార్థాలు : 8 బ్రెడ్ ముక్కలు, నెయ్యి, అర లీటర్ పాలు, అర కప్పు చక్కెర,10 కిస్ మిస్, 20 యాలకుల పొడి,ఒక టీస్పూన్, జీడిపప్పు,సారా పప్పు.

తయారీ విధానం : బ్రెడ్ ముక్కలను చిన్న ముక్కలుగా చేయాలి. వాటిని నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పాలను భాగా వేడి చేయాలి. బ్రెడ్ వేయించిన పాత్రలోనే సారపపప్పు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. యాలకుల పొడిని బ్రెడ్ పై చల్లుకోవాలి. ఒక గిన్నెలో చెక్కర వేసి అందులో అరకప్పు నీళ్లు పోసి పాకం చేయాలి. ఆ పాకాన్ని పాలలో కలిపి జీడిపప్పు,కిస్‌మిస్, సారపప్పు వేస్తే సరిపోతుంది. తీయ్యటి డబల్ కా మీఠా రెడీ..

Ramadan Special Recipes

 

5 . హలీం ఇలా చేయండి : 

కావాల్సిన పదార్థాలు : 2 కేజీల చికెన్, అర కప్పు మినపప్పు, అరకప్పు శనగ పప్పు,రెండు కప్పుల గోధుమలు, 4 పెద్ద చెంచాల అల్లం వెల్లుల్లి ముద్ద, అరకప్పు పెరుగు, చెంచా మిరియాలు,దాల్చిన చెక్కలు రెండు,అర కప్పు ఉల్లిపాయలు, చెంచా సాజీర,రెండు యాలకులు,50 గ్రాముల గులాబీ రేకలు,2 లవంగాలు,అరకప్పు కొత్తిమీర తరుగు,పావు కప్పు పుదీనా ఆకులు,పోట్లీ మసాలా,6 పచ్చిమిర్చి,రుచికి తగినంత ఉప్పు

తయారీ విధానం :  గోధుమల్ని అరగంటసేపు నీటిలో నానపెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి, ఉప్పు కలిపి చికెన్ బాగా ఉడికించాలి. తర్వాత ఒక పాత్రలో గోధుమలు, పప్పులు, నాలుగు పచ్చిమిర్చి, అర చెంచా మిరియాలు వేసి 10 కప్పులు నీళ్లు పోసి అరగంట సేపు ఉడకపెట్టుకోవాలి. మాంసాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసి వేడి అయిన తర్వాత మసాలా దినుసులు, జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, గులాబీ రేకలు, మెత్తగా గ్రైండ్ చేసుకున్న మాంసం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని వేయించాలి. 5 నిమిషాల తర్వాత పెరుగు వేసి సుమారు 15 నిమిషాలు వేయించుకోవాలి. కొంత సేపటికి 3 కప్పుల పోట్లీ మసాలాతో పాటు నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గోధుమ మిశ్రమంలో నెయ్యి , ఉప్పు వేసి అరగంటపాటు దమ్ చేసుకుంటే హలీమ్  తయారైపోతుంది. ఇలా ఇంటిలోనే నోరూరించే హలీమ్ సిద్ధం చేసుకోవచ్చు. 

Ramadan Special Recipes

 

6 . చికెన్ జాల్ ఫ్రీజ్ : 

కావాల్సిన పదార్థాలు : అర కేజీ చికెన్, కప్పు టమాట ముక్కలు, పావు కప్పు క్యాప్సికమ్, 4 పచ్చి మిర్చి,గరం మసాలా ఒక టీ స్పూన్,అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర,పసుపు, ఉల్లిపాయ ముక్కలు, అర కప్పు కారం పొడి,రుచికి సరిపడా ఉప్పు.

తయారీ విధానం : ఉప్పు,కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ముందుగా చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత.. పొయ్యిపై ప్యాన్ పెట్టి అందులో సరిపడా నూనె పోసుకోవాలి. పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ అల్లం తురుము వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలు వేసి ఉడికించాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత క్యాప్సికమ్, కొంచెం కారంపొడి వేయాలి. 5 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు మిక్స్ చేసి, మరో ఐదునిముషాలు ఉడికించాలి. తర్వాత గరం మసాల వేసి కప్పు నీళ్లు పోయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు ఉడికించి కొత్తమీర వేసి చికెన్ జాల్ ఫ్రిజ్‌ను కూడా గార్నిష్ చేసి దించేయాలి. 

Ramadan Special Recipes