Ramakrishnan was arrested by the Chennai police
mictv telugu

తల్లిని అనాథ చేసి అమెరికా బయల్దేరిన కుమారుడి అరెస్ట్

August 27, 2022

మానవ సంబంధాలు ఎలా మంటగలిసి పోతున్నాయో చెప్పేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణ. భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిలిన తల్లిని ఒంటరిగా వదిలేసి అమెరికా వెళ్లిపోదామనుకున్న కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. చెన్నై మైలాపూర్‌కి చెందిన దుర్గాంబాళ్ (74) ఈ నెల 15న తన కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో.. ‘నాకు భర్త కుప్పుస్వామి, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. పెద్ద కొడుకు రెండేళ్ల క్రితం చనిపోగా, చిన్న కూమారుడు రామకృష్ణన్ అమెరికాలో భార్యాబిడ్డలతో కలిసి జీవిస్తున్నాడు. నా భర్త కుప్పుస్వామి జులై 3న మరణించాడు. మరణవార్త తెలిసినా చిన్న కొడుకు అంత్యక్రియలకు రాలేదు. తర్వాత పదిరోజులకు ఇంటికి వచ్చాడు. భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్న తనను ఆర్ధికంగా ఆదుకోవాలని కోరితే తిరస్కరించాడు. వయసు మీదపడి భర్తను కోల్పోయిన నాకు సాయం చేసేందుకు నిరాకరించిన కొడుకుపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది. దీంతో పోలీసులు సీనియర్ సిటిజన్స్ పర్యవేక్షణ చట్టం – 2007 కింద కేసు నమోదు చేసి రామకృష్ణన్ అమెరికాకు వెళ్లకుండా ఎయిర్ పోర్టులో లుకవుట్ నోటీస్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ ఉదయం రామకృష్ణన్ గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల కళ్లుగప్పి అమెరికాకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. అక్కడ పాస్‌పోర్టు తనిఖీ సమయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి రామకృష్ణన్‌ను అరెస్ట్ చేశారు.