ప్రభుత్వం నుంచి తిరుమలకు విముక్తి కలగాలి : రమణ దీక్షితులు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వం నుంచి తిరుమలకు విముక్తి కలగాలి : రమణ దీక్షితులు

July 7, 2020

ngv n

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. శ్రీవారి ఆలయానికి కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలని  పేర్కొన్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రమణ దీక్షితులు చేసిన ఈ వ్యాఖ్యలపై టీటీడీ ఉద్యోగులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ఉత్తారఖండ్‌లో చార్‌దామ్‌ సహా 54 దేవాలయాలను రాష్ట్ర పరిధి నుంచి తప్పించాలని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ పూర్తి కావడంతో ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన పంచుకున్నారు. దీనికి రమణ దీక్షితులు కూడా రిప్లే ఇచ్చారు.‘ఆల్ ది బెస్ట్ స్వామిజీ.. మీ విజయానికి దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మీ విజయం సనాతన ధర్మం విజయంగా భావిస్తున్నా. ఉత్తరాఖండ్‌లాగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుమలకు కూడా విముక్తి లభించాలి’ అంటూ ఆయన పేర్కొన్నారు.

టీటీడీ పాలనా నిర్వహణపై కూడా సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని కోరారు. ఆలయ ఆస్తులు, నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు. దాన్ని ఉటంకిస్తూ.. రమణ దీక్షితులు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి ఆలయ అర్చకులకు కూడా ప్రభుత్వ ఉద్యోగ విరమణ చట్టం వర్తింప జేయడంతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో తిరిగి ఆయన్ను ఆగమశాస్త్ర సలహా మండలి సభ్యుడిగా విధుల్లోకి తీసుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆయన శ్రీవారి ఆలయంలో తిరిగి బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే.