కరోనా టైంలో దర్శనాలేంటి?.. రమణ దీక్షితులు ఫైర్  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా టైంలో దర్శనాలేంటి?.. రమణ దీక్షితులు ఫైర్ 

July 16, 2020

Professor Makes Straws From Coconut Lea

తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ట్వీట్ సంచలనం రేపింది. ఈవో తీరుపై నేరుగా విమర్శలు చేస్తూ పోస్టు పెట్టారు. అర్చకులకు కరోనా సోకుతున్నా కనీసం ఆలయంలో దర్శనాలు నిలిపివేయడంపై ఈవో స్పందించడం లేదని మండిపడ్డారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల్లో 50 మందిలో 15 మందికి కరోనా వచ్చిందనీ, ఇంకా 25 మంది ఫలితాలు రావాల్సి ఉందని ఆందోళన నవ్యక్తం చేశారు. అర్చకులపై ఈవో వ్యవహారశైలి దారుణంగా ఉందని ఆరోపించారు. ఆయన చేసిన కామెంట్లను సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా ట్యాగ్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. 

దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇప్పటి వరకు 140 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారని చెప్పారు. వీరిలో కొంత మంది కోలుకుని తిరిగి విధుల్లో చేరారని చెప్పారు. ఇంకా 70 మంది సిబ్బంది చికిత్స పొందుతున్నారన్నారు. ఇప్పటి వరకు భక్తులెవరూ వ్యాధిబారిన పడలేదని తెలిపారు. అదే కనుక జరిగితే ఆలయంలో దర్శనాలను నిలిపివేసే అంశంపై ఆలోచిస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయంలో గౌరవ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా ఇటీవల టీటీడీ కూడా ప్రభుత్వం ఆధీనం నుంచి బయటపడాలంటూ రమణ దీక్షితులు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.