జేమ్స్‌బాండ్ సినిమాలో రాంచరణ్.. అమెరికా సినీ మేకర్
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన రాంచరణ్ ఖ్యాతి ఖండాంతరాలకు పాకుతోంది. ఈ సినిమా ఓటీటీలో ఇంగ్లీష్ భాషలో రిలీజవడంతో హాలీవుడ్ వారు విపరీతంగా చూసేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్, దర్శకులు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, హీరోల నటన, డ్యాన్సులను మెచ్చుకుంటూ అనేక ట్వీట్లు చేశారు. ఇప్పుడు తాజాగా అమెరికన్ టీవీ సిరీస్ మేకర్ చియో హోడారి రాంచరణ్ నటనను ప్రశంసిస్తూ ఆయన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హాలీవుడ్ చిత్రం జేమ్స్ బాండ్ సిరీస్‌లో నటించే అర్హత రాంచరణ్‌కు ఉందని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ సిరీస్‌లో నటించే అర్హత ఉన్న నటుల జాబితాను ఆయన రిలీజ్ చేశారు. అందులో బాండ్ పాత్రకు న్యాయం చేసే వారి లిస్టులో రాంచరణ్ పేరును చేర్చారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ నటన, డ్యాన్సులతో ఆకట్టుకున్నాడని కితాబిచ్చాడు. రాంచరణ్‌తో పాటు ఇద్రిస్ ఎల్బా, సోప్ దిరిసు, మాథ్యూ గూడే, డామ్సన్ ఇద్రిస్ వంటి నటుల పేర్లను కూడా లిస్టులో పేర్కొన్నాడు. మరి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం మన తెలుగు హీరోకు వస్తుందో లేదో చూడాలి.