‘అవును. అన్నాను. ఇప్పుడేం చేస్తావ్’ రాందేవ్ బాబా ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

‘అవును. అన్నాను. ఇప్పుడేం చేస్తావ్’ రాందేవ్ బాబా ఆగ్రహం

March 31, 2022

పతంజలి యోగా గురువు రాందేవ్ బాబా పాత్రికేయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై సదరు పాత్రికేయుడు పదే పదే ప్రశ్నలు అడగడంతో సహనం కోల్పోయిన బాబా.. కెమెరా ముందే తన ఆవేశాన్ని ప్రదర్శించారు. వివరాల్లోకెళితే.. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాందేవ్ బాబా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ పాత్రికేయుడు గతంలో బాబా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 20014లో లీటర్ పెట్రోల్ రూ. 40, గ్యాస్ బండ రూ. 300 కు ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడేమంటారు? అంటూ విలేకరి ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో ఇబ్బంది పడ్డ రాందేవ్ బాబా ‘ అవును. అప్పుడు ఆ మాట అన్నాను. ఇప్పుడేంటి? ఇలాంటి ప్రశ్నలు అడిగి విసిగించకు’ అంటూ మందలించారు. అయినా పాత్రికేయుడు వినకుండా అదే మళ్లీ అడగడంతో ఆగ్రహించిన బాబా ‘ అయితే ఏంటి? నోర్మూసుకో. మళ్లీ మళ్లీ అడిగితే బాగుండదు. నన్ను రెచ్చగొట్టకు. మంచిగా ఉండు’ అంటూ హెచ్చరించారు. అనంతరం బాబా మాట్లాడుతూ.. ‘ఆయిల్ ధరలు తగ్గిస్తే పన్నులు రావు. డబ్బు లేకపోతే ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలి? దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? అని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ విషయంలో నేను ఏకీభవిస్తా. ధరలు తగ్గాలి. కానీ, ఇదే సమయంలో ప్రజలు కూడా ఎక్కువగా శ్రమించాలి. దాంతో ధరల పెరుగుదలను తట్టుకోవచ్చు. నేను నాలుగు గంటలకు లేచి, రాత్రి పది వరకు పని చేస్తా’నని అభిప్రాయపడ్డారు.