అతి ఎప్పటికైనా చేటు చేస్తుందని పెద్దలు అంటుంటారు. అందుకే ఏ పని చేసినా ప్రమాదాలకు దూరంగా ఉండటం మంచిది. కానీ కొంత మంది వాటికి ఎదురెళ్లి మరీ అపాయలను కొని తెచ్చుకుంటారు. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ విషయంలోనూ అదే జరిగింది. ఏనుగు మీదకు ఎక్కి యోగా చేయడానికి ప్రయత్నించి కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్లోని మథురలో ఉన్న ఓ ఆశ్రమానికి ఇటీవల ఆయన వెళ్లారు. అక్కడ యోగాసనాలు వేస్తూ ఆశ్రమంలో ఉన్నవారికి నేర్పించే ప్రయత్నం చేశారు. ఎప్పటిలాగే ఆయన స్టేజీపై కాకుండా వెరైటీగా ఓ భారీ ఏనుగును ఎక్కారు. దానిపై కూర్చుని పద్మాసనం వేశారు. ప్రాణాయామం చేస్తుండగా ఏనుగు ఎందుకో అటూ ఇటూ కదిలింది. అయినా ఆయన పట్టించుకోలేదు. మరోసారి అలాగే అటూ ఇటు ఊపడంతో ఆయన అదుపుతప్పి కిందపడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది రాందేవ్ బాబాను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మాత్రం రాందేవ్ కొంత అసహనంగా కనిపించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.