రాందేవ్ మహిమ.. ఏప్రిల్లో తయారు చేశారు! - MicTv.in - Telugu News
mictv telugu

రాందేవ్ మహిమ.. ఏప్రిల్లో తయారు చేశారు!

March 22, 2018

మార్కెట్లో నకిలీ సరుకులు కామన్. జనాన్ని మోసగించడంతో వ్యాపారులు వేయని ఎత్తుల్లేవు. ప్రతిష్టాత్మక సంస్థలు, కంపెనీలు కూడా దీనికి అతీతం కావు. లాభాలు, లాభాలు..!  అందుకోసం మోసాలు మోసాలు..! ఇదే నేటి వ్యాపార సూత్రం. ఆయుర్వేద ఉత్పత్తులను తయారు చేస్తున్న యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి గ్రూప్ కూడా అదే బాట పట్టినట్లు తెలుస్తోంది. మనం ఇంకా మార్చినెలలో ఉండగా, ఈ పతంజలి మాత్రం ఒక నెల దాటేసి ఏ పాదలేపన మహిమతోనో భవిష్యత్తులోకి నడచిపోయి ఒక మహత్తరమైన ఔషధాన్ని తయారు చేసి మన ముఖాన కొట్టేసింది..!

ఈ ఫొటో చూస్తే విషయం అర్థమైపోయుంటుంది. 40 గ్రాముల బరువున్న దీన్ని 2018 ఏప్రిల్లో తయారు చేశామని అచ్చేశారు. ఈ మోసం గ్రహించిన ఎవరో వినియోగదారు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయిపోయింది. ఇంకా రాని నెలలో ఎలా తయారు చేశారబ్బా అని జనం జత్తు పీక్కుంటున్నారు.

బాబాకు చాలా మహిమలు ఉంటాయని, ఆయన వద్ద భూత భవిష్యత్తు కాలాల్లోకి వెళ్లే టైమ్ మిషన్ ఉంటుందని, అందులో ప్రయాణించి ఏప్రిల్లోకి వెళ్లి మందులు మాకులు నూరుకుని తయారు చేసిన మళ్లీ మన వర్తమాన కాలంలోకి వచ్చి మనకు ఇస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. మరికొందరేమో పొరపాటు జరిగి ఉంటుందని, అయినా ఆయుర్వేద మందులకు డేటుతో సంబంధం లేదని ముక్తాయిస్తున్నాయి. ఆయుర్వేద మందులు చాలాకాలం నిల్వ వుంటాయిగాని, ఇంకా రాని నెలలో తయారు చేయడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

అన్నట్లు ఈ ఔషధం పేరు గిలోయ్ ఘనవటి అంట. దగ్గు, జ్వరం వంటి సాధారణ జబ్బులనే కాకుండా మూత్రసంబంధ వ్యాధులను కూడా ఇది నిర్మూలిస్తుందని చెబుతున్నారు!