జవాన్లు, పోలీసులు అమరులైనప్పుడు గాల్లోకి కాల్పులు జరిపి చివరగా గౌరవ వందనం చేసే విషయం తెలిసిందే. అయితే ఈ సంప్రదాయాన్ని ఓ డాన్ అంత్యక్రియల్లో పాటించారు. కాల్పులు జరిపిన అతని అనుచరులు సెల్యూట్ కూడా చేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన చివరి అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప అంత్యక్రియల్లో చోటు చేసుకుంది. రామనగర జిల్లా బిడదికి చెందిన డాన్ ముత్తప్ప రాయ్ క్యాన్సర్‌తో బాధపడుతూ నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో మృతిచెందారు. దీంతో ఆయన మృతదేహాన్ని అనుచరులు బిడదిలోని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు.
అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు ఆయన భౌతికకాయానికి గన్ శాల్యూట్ చేశారు. గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆరుగురిని అరెస్ట్ చేశారు. బిడది పోలీస్ ఎస్సై మాట్లాడుతూ.. ఆయుధాల చట్టం కింద ఆరుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. అందరినీ అదుపులోకి తీసుకుని, వారు కాల్పులు జరిపేందుకు ఉపయోగించిన తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.