హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడానికి ఎందరో కదిలివస్తున్నారు. తమకు తోచిన విధంగా సామాన్యులే కాకుండా ప్రముఖులు కూడా విరాళాలు అందిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం అత్యధికంగా 15 కోట్లు ప్రకటించగా, తమిళనాడు 10 కోట్లు, పశ్చిమ బెంగాల్ 2 కోట్లు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు ఇప్పటికే విరాళాలు ప్రకటించగా తాజాగా, రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. వరదలతో నిరాశ్రయులైన బాధితులకు ఆహారం, సరుకులు అందించేందుకు గాను రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నట్టు వెల్లడించారు.
ఇదిలావుండగా వరద భాదితుల సహాయార్థం యువ కథానాయకుడు రామ్ పోతినేని కూడా విరాళం అందించారు. రూ.25 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మంత్రి కేటీఆర్ కార్యాలయానికి వెళ్లిన రామ్.. రూ.25 లక్షల చెక్‌ను కేటీఆర్‌కు అందించారు. కాగా, రామ్ మంచి మనసుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.