రామసేతు వయసుతోపాటు, దాన్ని ఎవరు నిర్మించారన్న వివాదాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. కొందరు లక్షల సంవత్సరాల కిందట దాన్ని కట్టారని చెబుతున్నారు. కొందరేమో క్రీస్తుపూర్వం 7వ సహస్రాబ్దంలో అని, కొందరు కొన్ని వేల ఏళ్ల కిందట అని చెబుతున్నారు. దీన్ని కట్టింది వానరులని కొందరు, కాదు సహజసిద్ధంగా ఏర్పడిందని కొందరు వాదిస్తున్నారు.దీని సంగతి తేల్చేందుకు ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. భారత్, శ్రీలంకను కలిపే ఈ సేతు వయసు 18,400 ఏళ్లని తాజా పరిశోధనలో తేలింది. చెన్నైలోని మద్రాస్, అన్నా విశ్వవిద్యాలయాల పరిశోధక విద్యార్థుల బృందాలు ఈ అధ్యయనం చేశాయి.
అధ్యయనంలో భాగంగా.. 2015లో రామేశ్వరంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద మూడు చోట్ల రంధ్రాలు చేసి మట్టి, రాతి నమూనాలను తీసుకున్నారు. వీటిని ఆధునిక కార్బన్, ఇతర పద్ధతుల్లో పరీక్షించారు. ఫలితాల్లో రామసేతు 18,400 ఏళ్ల కిందట ఏర్పడినట్టు గుర్తించామని అన్నా వర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు మరిన్ని వివాదాలకు దారితీసే అవకాశముంది. రామసేతు మానవ నిర్మితమని పరిశోధకుల నివేదికను ఉటంకిస్తూ ఇటీవల ఓ అమెరికన్ టీవీ చానల్ చెప్పడం తెలిసిందే. తమిళనాడులోని పాంబన్, శ్రీలంకలోని మన్నార్ దీవి మధ్య సముద్రంలో 35 కిలోమీటర్ల మేర ‘రామసేతు’ ఉంది. ఇది సముద్రం లోపల పది మీటర్ల లోతు, 100 మీటర్ల వెడల్పు ఉన్న దీన్ని ఆడమ్స్ బ్రిడ్జి అనీ అంటారు.