సినీ నటుడు నరేష్‌పై అతని మూడో భార్య రమ్య రఘుపతి సంచలన ఆరోపణలు చేశారు. తనను వదిలించుకోవడానికి దేవుడు లాంటి కృష్ణగారితో అక్రమ సంబంధం అంటగట్టాడని షాకింగ్ విషయం వెల్లడించారు. తనతో కృష్ణగారి ప్రాణాలకు హాని ఉందని రాసి కృష్ణగారి సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో సమర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత తనకు ఇంజెక్షన్ సూట్ పంపారని గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలేవీ కృష్ణగారికి చేరకుండా జాగ్రత్తపడిన దుర్మార్గుడని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ తనవద్ద ఉన్నాయని, కానీ కృష్ణగారి ఇంటి మర్యాద, పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్లూ ఈ నిజాన్ని కడుపులోనే దాచుకున్నానని తెలిపారు. నరేష్ వేధింపులపై కుటుంబసభ్యులకు చెప్తే కృష్ణ గారికి చెప్పమని సలహా ఇస్తే ఆయన గౌరవం దెబ్బతినకూడదని చెప్పలేదన్నారు.
అయితే రోజురోజుకీ నరేష్ దారుణాలు పెరిగిపోతున్నందున ఈ నిజాలు చెప్పాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నరేష్ – పవిత్రల ముద్దు వీడియో కొత్త ఏడాది ప్రారంభంలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. త్వరలో తాము పెళ్లిచేసుకోబోతున్నట్టు ఈ జంట ప్రకటించారు. ఈ విషయంపై రమ్య మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి పెళ్లి జరగనివ్వనని, నరేష్‌కి విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు. తన కుమారుడు నాన్న కావాలంటున్నాడు కనుక నరేష్ నుంచి విడిపోనని స్పష్టం చేశారు. పవిత్రను నరేష్ తొలిసారి పరిచయం చేసినప్పుడు తన చేత్తో అన్నం పెట్టానని, కానీ వారిద్దరూ కలిసి తనకు సున్నం పెట్టాలని చూశారన్నారు. ఏ విషయమైనా కోర్టులో తేల్చుకుంటానని తెగేసి చెప్పారు.