రంజాన్.. ధర్మం, దానం, క్రమశిక్షణ నేర్పే పర్వదినం  - MicTv.in - Telugu News
mictv telugu

రంజాన్.. ధర్మం, దానం, క్రమశిక్షణ నేర్పే పర్వదినం 

May 21, 2020

Ramzan special article festival importance

ప్రతి పండుగ వెనుకా పరమార్థం ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, చరిత్ర గతి మార్చిన వీరులను స్మరించుకోవడం పర్వదినాల్లో సర్వసామాన్య అంశం. వీటితో పాటు మనిషికి క్రమశిక్షణ నేర్పి, ధర్మాన్ని, దయాగుణాన్ని ప్రబోధించే పండగలు కూడా ఉన్నాయి. వాటిలో రంజాన్ ఒకటి. ముస్లింలకు అతి పెద్ద పండగ ఇది. ఇస్లాం ధర్మానికి మూలమైన ఖురాన్ రంజాన్ నెలలో అవతరించింది. ఈ పండుగ వెనక మానసిక, శారీరక వికాసం వంటి మరెన్నో ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి. నెలవంక దర్శనంతో మొదలై, మళ్లీ నెలవంక దర్శనంతోనే ముగిసే ఈ పర్వదినం గురించి తెలుసుకుందామా మరి. 

ఉపవాసం 

Ramzan special article festival importance

రంజాన్ మాసంలో ఉపవాసం అత్యంత ప్రధానమైంది. చాంద్రమానాన్ని పాటించే ఇస్లాం కేలండర్ తొమ్మిదో నెల రంజాన్. తమ పవిత్ర గ్రంథం ఖురాన్ ఈ నెలలోనే పుట్టందని వారి విశ్వాసం. అందుకే ఈ నెలంతా పవిత్రమని భావిస్తారు. నెలవంక దర్శనంతో రంజాన్ మొదలవుతుంది. ఖురాన్ బోధన ప్రకారం నెలంతా ‘రోజా’ పేరుతో ఉపవాసం చేస్తాం. పార్సీ భాషలో రోజాఅంటే ఉపవాసం అని అర్థం. ఎంతో నిష్టతో దీన్ని పాటిస్తారు.  రోజూ ఐదుపూటల నమాజోపాటు 13 గంటలు ఉపవాసం ఉంటారు. వేకువజామున భోంచేసి(సహర్) సూర్యాస్తమయం తర్వాత దీక్ష విరమిస్తారు. సాయంత్రం తినే ఆహారాన్ని ఇఫ్తార్అంటారు. నిత్యం దైవిచింతనతో గడుపుతారు. చెడు తలంపులకు మనసులోకి అస్సలు రానివ్వరు. రోజాలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడకూదని, మనోవికారాలకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతారు. అయితే పిల్లలు, వృద్ధులు, రోగులకు రోజా తప్పనిసరి కాదు. ప్రయాణాల్లో ఉన్నవారు కూడా రోజాను వాయిదా వేసుకోవచ్చు. రంజాన్ నెలలో 27వ రోజును షబ్-ఎ-ఖద్ర్ అని పిలుస్తారు. ఖురాన్ ఆ రోజే పుట్టింని, రాత్రంతా జాగారం చేస్తారు.దాని వల్ల పాపాలు పోతాయని భావిస్తారు. 

పేదలకు దానధర్మాలు

రంజాన్ మాసంలో ముస్లింలు పేదసాదలకు దానధర్మాలు చేయడాన్ని విధిగా భావిస్తారు. దీన్ని జకాత్ అంటారు. పేదలకు ఒక పూట భోజనం అందిస్తే దేవుడు తమకు వెయ్యిపూటల భోజనాన్ని సమకూరుస్తారని వారి నమ్మకం. మసీదుల వద్ద చేరే నిర్బాగ్యులకు, వికలాంగులకు అందరూ తమకు తోచిన డబ్బులు, ఆహార పదార్థాలను వితరణ చేస్తారు. ప్రతి ధనికుడు ఏడాది చివర్లో తనకు మిగిలిన సంపద నుంచి రెండున్నర శాతాన్ని దానం చేయాలి. పండగను కేవలం కలిగిన వాళ్లే కాకుండా పేదసాదలు కూడా జరుపుకోడానికి ఇది వీలు కల్పిస్తుంది. నెల ముగింపులో నెలవంక దర్శనం చేసుకుని ఉపవాసాన్ని ముగిస్తారు. ఆ మరుసటి దినాన్ని రంజాన్ గా జరుపుకుంటారు. దీనికే ఈదుల్‍ఫితర్ అని మరోపేరు. కొత్తబట్టలు ధరించి, మసీదులకు వెళ్లి ప్రార్థన చేస్తారు. ఈద్ ముబారక్ అంటూ ఆలింగనం చేసుకుంటారు. సేమ్యా ఖీర్, బిర్యానీ వంటి పిండివంటలతో, రుచికర మాంసాహారాలతో ఇఫ్తార్ విందు చేసుకుంటారు.