రానా పెళ్లెప్పుడో చెప్పిన సురేశ్.. మాకు పని పెట్టారుగా..
టాలీవుడ్ యంగ్ హీరోలు అంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్ ఈ వరుసలో ఉండగా.. తాజాగా రానా కూడా చేరిపోయాడు. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా తన పెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చి అమ్మాయిని కూడా పరిచయం చేసేశాడు. తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను తర్వలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. దీంతో ఇప్పుడు ఫిలిం వర్గాల్లో వీరి పెళ్లి గురించే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ సమయంలో రానా తండ్రి సురేష్ బాబు వీరి పెళ్లి ఎప్పుడనే సస్పెన్స్‌ను కూడా తొలగించారు.
రానా, మిహీకా పెళ్లి డిసెంబర్‌లో చేసే అవకాశం ఉందని సురేష్ బాబు వెల్లడించారు. ‘బాంబే టైమ్స్’తో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వివరాలను వెల్లడించారు. రానా, మిహీకా ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలనుకోవడం సంతోషం. వీరి పెళ్లి డిసెంబర్ లేదా అంతకంటే ముందే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మేం అంతా బిజీగా ఉన్నాం. పెళ్లికి సంబంధించి త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం’ అంటూ పేర్కొన్నారు.