నిర్మాతను మోసగాడన్న రానా.. ట్విటర్లో రచ్చరచ్చ - MicTv.in - Telugu News
mictv telugu

నిర్మాతను మోసగాడన్న రానా.. ట్విటర్లో రచ్చరచ్చ

October 28, 2019

తీసే సినిమాలన్నీ విడుదల కావు. కొన్ని మధ్యలో ఆగిపోతుంటాయి. కొన్ని శాశ్వతంగా అటకెక్కతుంటాయి. ప్రముఖ నటుడు రానా మొదలుపెట్టిన 1945 పీరియాడిక్ చిత్రం కూడా ఆ కోవలోకి చేరిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే దీపావళి సందర్భంగా చిత్ర నిర్మాత రాజరాజన్ అకస్మాత్తుగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి కలకలం రేపారు. దీనిపై రానా ఘాటుగా స్పందించారు. నిర్మాత కూడా కౌంటర్ ఇవ్వడంతో ఇదో వివాదంగా మారిపోయింది. 

‘ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమంటే డబ్బుల కోసం మోసం చేయడమే.  సినిమాను పూర్తి చేయడంలో నిర్మాత విఫలమయ్యాడు. ఏడాదిగా చిత్రబృందం నన్ను సంప్రదించలేదు. నేనున కూడా వాళ్లను కలవలేదు. మధ్యలో ఆగిపోయిన సినిమాకు ఏ విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారు..’ అని రానా ట్వీట్ చేశాడు. దీనిపై రాజరాజన్ వెంటనే స్పందించాడు. సినిమా వ్యవహారం దర్శకుడి పని అని అన్నారు. ‘సినిమా పూర్తయిందో లేదో ప్రేక్షకులకు వదిలేద్దాం. నేను రెండు నెలల షూటింగ్ కోసం కోట్లు ఖర్చు పెట్టాను. మధ్యలోనే ఆగిపోయిన చిత్రాన్ని ఎవరూ విడుదల చేయాలని కోరుకోరు.. ’ అని అన్నారు. 1945 చిత్రానికి సత్యశివ దర్శకత్వం వహిస్తున్నారు.