రాజ్‌నాథ్ కాళ్లు పట్టుకున్న డీజీపీ.. వైరల్! రియల్! - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్‌నాథ్ కాళ్లు పట్టుకున్న డీజీపీ.. వైరల్! రియల్!

March 10, 2018

ఫోటో ఎడిటింగ్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఏది రియల్ ఫొటోనో, ఏది ఫేక్ ఫోటోనే తెలియని పరిస్థితి పొగమంచులా దట్టంగా అలముకుంది. ఇది కేవలం వ్యక్తుల మధ్య గొడవలకే పరిమితం కాకుండా, రాజకీయాల దాకా పాకి పెచ్చరిల్లిపోవడంతో మరింత గందరగోళం నెలకొంది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ ఏదీ తక్కువ తినడంలేదు.

కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్‌ కాళ్లను గుజరాత్ డీజీపీ పట్టుకుంటున్నట్లు ఉన్న ఫొటో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ నిరంకుశ పాలకు ఇది నిరదర్శనమని, పోలీసులను, సీబీఐని, ఈసీని కేంద్రం పెంపుడు కుక్కల్లా వాడుకుంటోందని ఈ ఫొటోను చూసి కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. దీన్ని పలువురు షేర్ చేసుకున్నారు.

దీంతో బీజేపీ దీనిపై ఆరా తీసింది. హోం మంత్రి కాళ్లను డీజీపీ పట్టుకోలేదని తేల్చింది. అసలు ఆ ఫోటోలో ఉన్నది గుజరాత్ డీజీపీనే కాదని తేల్చింది. ఆ ఫోటో నిజానికి.. 2011లో విడుదలైన  ‘క్యా యే సచ్ హై’ చిత్రంలోని స్టిల్ అని, దీనికి మాజీ ఐపీఎస్ అధికారి యోగేశ్ ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారని తెలిపింది. దీంతో ఈ ఫేక్ ఫోటోను పోస్ట్ చేస్తున్న, షేర్ చేస్తున్న నెటిజన్లు గతుక్కుమంటూ డిలీట్ చేస్తున్నారు.