Rangambai Tanda voters boycotted polling in munugode by election
mictv telugu

మునుగోడు ఉప ఎన్నిక.. పోలింగ్ బహిష్కరించిన తండా వాసులు

November 3, 2022

Rangambai Tanda voters boycotted polling in munugode by election

రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక గురువారం ఉదయం నుంచి ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని గ్రామాల్లో ఓటుకు తులం బంగారం, రూ. 30 వేలు ఇస్తేనే ఓటు వేస్తామని ప్రజలు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ తండా వాసులు మొత్తం పోలింగ్‌ని బహిష్కరించడం ఆసక్తికరంగా మారింది.

కొత్తగా ఏర్పడిన గట్టుప్పల్ మండలం అంతం పేట గ్రామానికి అనుబంధంగా ఉన్న రంగంబాయి తండాలో మొత్తం 350 ఓట్లుండగా, ఇప్పటివరకు ఒక్కరు కూడా ఓటు వేయకపోవడం గమనార్హం. ఈ విషయంపై మీడియా వారిని ప్రశ్నించగా, తండావాసులు ఏక కంఠంతో ఒకే మాట చెప్తున్నారు. ‘ మా తండా నుంచి అంతంపేట గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంది. ఎప్పుడో ముత్తాతల కాలం నాటి మట్టి రోడ్డే ఇప్పటికీ దిక్కవుతోంది. తారు రోడ్డు వేయాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ వచ్చాం. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తండాకు వచ్చి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. రోడ్డు వేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పారు. ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మా చిరకాల డిమాండ్ నెరవేరుతుందని ఆశపడ్డాం కానీ నిరాశే ఎదురైంది. ఎప్పటిలాగే హామీలిచ్చి నాయకులు ఓట్లు వేయించుకుంటున్నారు. ఈ సారి మోసపోకూడదని నిశ్చయించుకొని పోలింగ్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’మని వెల్లడించారు.

https://fb.watch/gznQ914u5P/