తలసరి ఆదాయంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పెద్ద రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకోగా.. జిల్లాల వారీగా చూసినప్పుడు రంగారెడ్డి జిల్లా ముంబైని మించిపోయింది. తాజాగా వెల్లడైన నివేదికల ప్రకారం దక్షిణ భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. ఏకంగా కర్ణాటకలోని బెంగళూర్ అర్భన్ జిల్లాను వెనక్కి నెట్టి తొలిస్థానం సాధించింది. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ. 6.25 లక్షలు కాగా.. బెంగళూర్ అర్బన్ జిల్లా తలసరి ఆదాయం రూ.5.42 లక్షలుగా ఉంది.
దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఒక్క రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలే టాప్ 10 జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా రూ.3.62 లక్షల తలసరి ఆదాయంతో 5వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయం పరంగా చూస్తే కేరళ, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన జిల్లాలే ఎక్కువగా ఉన్నాయి. ఆంధప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ ఒక్క జిల్లా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోలేదు. టాప్ 10 జిల్లాలను పరిశీలిస్తే రంగారెడ్డి(తెలంగాణ), బెంగళూర్ అర్బన్(కర్ణాటక), తిరువళ్లూర్(తమిళనాడు), దక్షిణ కన్నడ(కర్ణాటక), హైదరాబాద్( తెలంగాణ), కోయంబత్తూర్(తమిళనాడు), ఈరోడ్(తమిళనాడు), ఎర్నాకులం( కేరళ), అలప్పుజా(కేరళ), ఉడిపి ( కర్ణాటక) జిల్లాలు ఉన్నాయి.
గత ఆరేడు సంవత్సరాల్లో గ్రేటర్ హైదరాబాద్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఐటీ రంగంలో ఎగుమతులు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. పారిశ్రామికంగా అనేక అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌కు తరలివచ్చాయి. అదీ కాక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లాంచింగ్స్‌లో ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. తలసరి ఆదాయానికి ఇది కూడా ఓ కారణమని చెప్పొచ్చు. అంతేకాదు అమెరికా, కెనడా, గల్ఫ్, యూరప్ దేశాల్లో నివసిస్తున్న నాన్- రెసిడెంట్ ఇండియన్స్(ఎన్నారైలు) పెట్టుబడులు పెట్టేందుకురియల్ ఎస్టేట్ మార్కెట్ ఫస్ట్ ఆప్షన్‌గా హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారు. ఈ కారణాలతో రంగారెడ్డి జిల్లా సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్‌గా నిలచిందని చెప్పొచ్చు.