అవధ్ యువరాజు.. దిక్కులేని చావు.. - MicTv.in - Telugu News
mictv telugu

అవధ్ యువరాజు.. దిక్కులేని చావు..

November 7, 2017

https://twitter.com/theparvezsultan/status/927766179166355458

 

ఎంత సంపాదించినా, ఎన్ని పదవులు అలంకరించినా చచ్చిపోయాక వెంట ఏదీ రాదు. అవధ్ యువరాజు అలీ రజా అలియాస్ సైరస్ విషాద మరణం కూడా అలాంటిదే. కాకపోతే ఆయన ఎవరూ ఊహించనంత దుస్థితిలో, ఒంటరిగా, దరిద్రంలో, కటిక నేలపై చనిపోయాడు.

ఢిల్లీ శివారులోని అటవీ ప్రాంతంలో 14వ శతాబ్దినాటి పాడుబడిన తుగ్లక్ కాలపు శిథిల భవనంలో సెప్టెంబర్ 2న చనిపోయాడు. చాలా ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రజాకు అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరైనా వస్తారేమోనని మూడు రోజులు ఎదురు చూశారు. ఫలితం లేకపోవడంతో వారే అంత్యక్రియలు నిర్వహించారు.

రజా చావు విషయం కూడా నిజానికి లోకానికి తెలిసేది కాదు. ఆయన ఎక్కువగా బయటికి వచ్చేవాడు కాదు. సమీపంలోని ఇస్రో ఎర్త్ స్టేషన్ అధికారులు ఆయనను అప్పుడప్పుడూ గమనించేవారు. ఆయన కదలికలు కనిపించకపోవడంతో తొలిసారి రజా మహల్లోకి తొంగిచూడగా.. ఆయన శవం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘రజా సాహెబ్ గారు అనారోగ్యం వల్ల బయటి వచ్చేవారు కాదు. నిత్యావసరాలను తెమ్మని నన్ను అడిగేవాడు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కొన్ని మామిడి పళ్లు, ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాడు’ అని ఎర్త్ స్టేషన్ గార్డు కుమార్ చెప్పాడు.

రజా ఒకప్పుడు చెప్పలేనంత విలాసంగా బతికాడు. ఆమె తల్లి బేగమ్ విలాయత్ మహల్ తన కుటుంబంతో 1970 దశకంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఓ లగ్జరీ వెయిటింగ్ గదిలో నివసించింది. తాను అవధ్ నవాబు వారసురాలినని, తనకు అవధ్ సంస్థానంలోని అస్తులను అప్పగించాలని ఆమె కోర్టులో కొట్టాడింది. సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారు అవధ్ నవాబుల ఆస్తులన్నీ లాక్కున్నారని, అవి తమవేనని వాదించింది. ఆమె రైల్వే స్టేషన్ లాడ్జిని ఆక్రమించడంతో అప్పట్లో పార్లమెంటులో గొడవైంది. ప్రధాని ఇందరా గాంధీ జోక్యంతో బేగానికి 14వ శతాబ్ది నాటి మాల్చా మహల్‌పై హక్కులు దక్కాయి. బేగం 1985లో కుటుంబంతో సహా అడవి దారిలోని ఆ మహల్‌కు మకాం మార్చింది. అప్పట్లో ఆమె వద్ద 11 జాతికుక్కలు ఉండేవి. ఎవర్నీ అటువైపు రానిచ్చేవి కావు. సమాజానికి దూరంగా ఏకాంత జీవితం సాగించింది బేగం కుటుంబం.

ఆ కుటుంబంలో చివరికి రజా ఒక్కడే మిగిలాడు మహల్లో. రెండేళ్ల కిందట అతని సోదరి, కుక్కలు చనిపోయాయి. తుగ్లక్ వంశ రాజైన ఫిరోజ్షా తుగ్లక్ వేటకు అడవిలోకి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఆ మహల్ కట్టించాడు. అందులో కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, బాత్రూం లేదు. అయినా రజా రాజుగాలే ఫీలయ్యేవాడు.

అడవిలో పుల్లలు ఏరుకొచ్చుకుని వంట చేసుకునేవాడు.  రజా చనిపోయాక అక్కడికెళ్లిన వారికి విరిగిపోయిన పాత కత్తులు,చెప్పులు, రాజులు వాడిన పింగాణీ పాత్రలు, జలతారు బట్టలు కనిపించాయి. రజా పోయాడు కనుక చరిత్ర పరంగా విలువైన మల్చా మహల్ ను ఏఎస్ఐ తన అధీనంలోకి తీసుకెళ్లాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఇది ప్రైవేటు ఆస్తి కనుక అది సాధ్యం కాదంటోంది ఏఎస్ఐ.

(హిందుస్తాన్ టైమ్స్ సౌజన్యంతో)