రేప్ కేసులో ఆశారాంకు జీవిత ఖైదు - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ కేసులో ఆశారాంకు జీవిత ఖైదు

April 25, 2018

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ(77)కు అత్యాచార కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అతడు మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది నిజమేనంటూ రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌ ఎస్సీ, ఎస్టీ ట్రయల్‌ కోర్టు బుధవారం ఈ శిక్ష విధించింది. తీర్పు విన్న ఆశారాం భోరున విలపించాడు. ఆశారాం ఎన్నో సామాజసేవా కార్యక్రమాలు నిర్వహించారని, ఆయనకు తేలికపాటి శిక్ష విధించాలని ఆయన న్యాయవాదులు చేసిన వినతిని కోర్టు తోసిపుచ్చింది.

బాలలపై అత్యాచారం, అక్రమ నిర్బంధం తదితర సెక్షన్ల కింద కోర్టు అతణ్ని దోషిగా తేల్చింది. ఈ కేసులో మరో ఇద్దరిని దోషులుగా తేల్చి 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది. ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. తీర్పు ఆశారాంకు వ్యతిరేకంగా రావడంతో అతని అనుచరులు విధ్వంసం సృష్టిస్తారని పోలీసులు గట్టిభద్రతా చర్యలు తీసుకుంటున్నారు. తీర్పుపై బాధితురాలి తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్నందుకు హత్యకు గురైన 9మంది కుటుంబాలకూ న్యాయం జరగాలన్నారు.

నేరం ఇదీ..

2013 ఆగస్టులో ఆశారాం జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో తనపై లైంగిక దాడి చేశాడని 16 ఏళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు దెయ్యం పట్టిందని, ఆమెను ఒంటరిగా తన వద్దకు పంపితే వదిలిస్తానని ఆశారాం నమ్మించి, ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి ఆశారాం జైల్లో ఉన్నాడు. అతనిపై  మరో రెండు రేప్ కేసులూ ఉన్నాయి. ఆశారాంకు బెయిల్‌ ఇవ్వకపోతే చంపేస్తామని అతని అనుచరులు జడ్జీలకు ఫోన్లు చేసి మరీ బెదిరించారు. ఆశారాంకు 10 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.