రేపిస్టులను ఠాణాలోంచి లాక్కొచ్చి కొట్టి చంపారు - MicTv.in - Telugu News
mictv telugu

రేపిస్టులను ఠాణాలోంచి లాక్కొచ్చి కొట్టి చంపారు

February 20, 2018

అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. పసిమొగ్గలను కూడా కాలరాస్తున్న దుర్మార్గులపై రగలిపోతున్నారు. బాధితులేకాకుండా మనసు ఉన్న ప్రతి ఒక్కరినీ కలిచివేస్తున్న ఈ దుర్మార్గాలపై వారి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఈ ఉదంతం చెబుతుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు రేపిస్టులను ప్రజలు లాకప్‌లోనుంచి లాక్కొచ్చి కొట్టి చంపారు.లోహిత్ జిల్లాలోని తేయాకు తోటల్లో పనిచేసే సంజయ్ సోబోర్, జగదీష్ లోహార్.. ఐదున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేశారు. ఈ నెల 12న తేజు పట్టణంలో జరిగిన ఈ ఘోరం జరిగింది. పాపను చంపేసి తలను ఒక చోట, మొండేన్ని ఒక చోట పారేసి పోయారు. పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజయ్, జగదీష్ లపై అనుమానం రావడంతో వారిని అరెస్ట్ చేసి విచారించారు. హత్యాచారానికి పాల్పడింది తామేనని వీరు ఒప్పుకున్నారు. మరోపక్క.. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. సోమవారం  వందలాదిమంది పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. లాకప్ తెరిచి ఇద్దరు రేపిస్టులను బయటికి లాక్కొచ్చారు. వారిపై మూకుమ్మడి దాడి చేసి చంపేశారు. శవాలను ఓ చౌరస్తాలో పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు పెట్టారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.